Tag: తెలుగు

  • మా లోగో

    లోగో గురించి:

    • పసుపు, కుంకుమ రంగులు మన సంస్కృతి కి చిహ్నాలుగా వాడటం జరిగింది.
    • మధ్యలో ఉన్న చిహ్నం మన పూర్వీకులైన “శాతవాహనులు” కు గుర్తుగా తీసుకోవటం జరిగింది.  ఇది “ఉజ్జయిని చిహ్నం”, (ఒక + గుర్తులో నాలుగు అంచుల వద్ద నాలుగు వృత్తాలు). శాతవాహనులు వారి రాజధాని అయిన ఉజ్జయిని నగరానికి గుర్తుగా ఈ చిహ్నాన్ని తమ నాణేల పైన ముద్రించారు.
    • క్రింద, “దేశ బాషలందు తెలుగు లెస్స” అని శ్రీనాధుడు మరియు శ్రీ కృష్ణదేవరాయులు కీర్తించినట్టి మాట.

    శాతవాహనుల నాణేలు

    గౌతమీ పుత్ర శాతకర్ణి (శాలివాహనుడు) ముద్రించిన వెండి నాణెం. ఒక వైపు ఉజ్జయిని చిహ్నం, మరోవైపు కొండ, సూర్యుడు, చంద్రుడు, నధి, ఇంకా ఆనాటి రాజ బాష అయిన ప్రాకృతం ..

    శతవాహనుల నాణెం, ఒక వైపు ఏనుగు మరోవైపు వారి ఉజ్జయిని చిహ్నం.

    ఒక్క సారి మన చరిత్రను పరిశీలిస్తే

    ఆంధ్ర అన్న పదం మొట్టమొదటగా క్రీ.పూ 8వ శతాబ్దములో ఐతరేయ బ్రాహ్మణం లో పేర్కొనబడినది.

    క్రీ.పూ. 7 వ శతాబ్దంలోని సంస్కృత రచనలు ఆంధ్ర ప్రజలను ఆర్యులు (‘Aryans’) గా వర్ణిస్తాయి. చరిత్రలో, వీరు దక్షిణ వింధ్య పర్వత ప్రాంతాల నుండి వలస వచ్చి ద్రవిడులలో కలసినట్లుగా చెప్పబడింధి. క్రీ.పూ. 232 లో మౌర్య సామ్రాజ్యాధిపతి అశోకుడి మరణం సమయంలో మళ్ళీ వీరి గురించి పేర్కొన్నారు. ఈ తేదీ నుండే ఆంధ్ర చరిత్ర ప్రారంభం అయ్యింది అని చెప్పవచ్చు.

    ‘ఆంధ్రులు’ అన్న పదం శాతవాహన వంశం నుండి వచ్చింది. శాతవాహనులు పశ్చిమ మహారాష్ట్ర లోని ఆంధ్ర మావల్ (‘Andra Maval’) ప్రాంతంను పరిపాలించటం వలన, వారు ఆంధ్రులుగా (‘Andhras’) గా పిలవబడతారు. తరువాత ఆంధ్రప్రదేశ్ కు ఆ పేరు ఈ రాజవంశం నుండే వచ్చింది. అశోకుని శిలాశాసనాలు శాతవాహనులను అతని సామంతులుగా పేర్కొన్నాయి.

    శాతవాహనులు దక్షిణ మరియు మధ్య భారతదేశం ను ధరణికోట మరియు జున్నార్ ల నుండి పరిపాలించారు (ధరణికోట, గుంటూరు జిల్లా అమరావతి మండలానికి చెందిన గ్రామము, ఇది ధాన్యకటకము పేరుతో ఒకప్పుడు శాతవాహనుల రాజధానిగా విలసిల్లిన పట్టణము. ఇక్కడ ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఉండెడిదని పుస్తకములలో రాయబడి ఉన్నది). వీరి పరిపాలన క్రీ.పూ. 230 సం. నుండి మొదలై సుమారు 450 సంవత్సరాలు కొనసాగింది. వీరి జనరంజక పరిపాలన వీరికి శాంతికాముకులుగా పేరు తెచ్చింది.

    పురాణాలలో మరియు వారి నాణేలపై ఈ వంశము ఆంధ్రులు, ఆంధ్ర భృత్యులు, శాతకర్ణులు మరియు శాతవాహనులని అనేక పేర్లతో పేర్కొనబడింది. గ్రీకు రాయబారి, యాత్రికుడు మెగస్తనీస్ వ్రాసిన ఇండికాలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది. ఈయన ఆంధ్రులు లక్ష పదాతిదళం, వెయ్యి యేనుగులు మరియు 30 దుర్భేధ్యమైన దుర్గాలు కలిగి ఉన్నారని పేర్కొన్నాడు.

    శాతవాహనుల కాలంలో దేశాంతర వాణిజ్యం బాగా సాగింది. తీరాంధ్ర, కళింగ ప్రాంతాలలోని అనేక రేవులు, కృష్ణా గోదావరి మధ్య ప్రాంతంలో పెక్కు నగరాలు వాణిజ్యకేంద్రాలుగా విలసిల్లాయి.

    శాతవాహనులలో 17వ రాజైన హాలుడు ప్రాకృత భాషలో రచించిన గాధాసప్తశతి ఒక ముఖ్యమైన చారిత్రిక, సాహిత్య గ్రంధం.

    టాంక్ బండ్ పైన శాలివాహనుడి విగ్రహం వద్ద ఉన్న శిలాఫలకం

    గౌతమీపుత్ర శాతకర్ణి (లేక శాలివాహనుడు) (క్రీ.పూ. 78-102) శాతవాహన రాజులలో 23వ వాడు. శాతవాహన రాజులందరిలోకి గొప్పవాడిగా పేరొందాడు. అతడి తండ్రి శాతవాహనుడు అశ్వమేధ యాగం చేసి రాజ్యాన్ని విస్తరించెను.అతని తరువాత శాలివాహనుడు రాజయ్యెను.

    శాలివాహనుడు భారత దేశాన్నంతా పరిపాలించిన తెలుగు చక్రవర్తి.శాలివాహనుడు శకులను, యవనులను, పహ్లవులను ఓడించి రాజ్యానికి పూర్వవైభవం తెచ్చాడు. ఈయన తన పూర్వీకుల పాలనలో కోల్పోయిన మధ్య దక్కను ప్రాంతాలు కూడా తిరిగి సంపాదించాడు. గౌతమీపుత్ర శాతకర్ణి, శక చక్రవర్తియైన విక్రమాదిత్యుని ఓడించి శాలివాహన శకానికి నాంది పలికాడు.  గౌతమీపుత్ర శాతకర్ణి కాలములో శాతవాహన ప్రాబల్యం దక్షినాన కంచి వరకు వ్యాపించింది.

    భారతీయ పంచాంగం(కాలండరు) శాలివాహనుని పేరు మీదే ఈనాటికీ చలామణీ అవుతోంది. మరాఠులు, ఆంధ్రులు, కన్నడిగులు నేటికీ శాలివాహన శకాన్ని పంచాంగాలలో ఉపయోగిస్తున్నారు. మరాఠులు, ఆంధ్రులు, కన్నడిగులు నేటికీ శాలివాహన శకాన్ని పంచాంగాలలో ఉపయోగిస్తున్నారు.

  • మన తెలుగు గురించి మీకు తెలుసా ??

    • 12వ శతాబ్ధిలో పాల్కురికి సోమనాధుడు "నవలక్ష తెలుంగు" – అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము – అని వర్ణించాడు.
    • అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష.
    • పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాలనాటిది
    • క్రీ.పూ.700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము)లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది.
    • క్రీ.పూ. 4వ శతాబ్ధిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించినాడు.
    • బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది.
    • ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల మందికి పైగా ఈ భాషను మాట్లాడతారు.
    • కర్ణాటక సంగీతం లోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నవి
    • తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు.

    • తెలుగుకి సంస్కృతం మాతృమూర్తి అనిపిస్తుంది. ఎందుకనగా ఉచ్చారణ, భావం సంస్కృతం ను తలపిస్తాయి.
    • భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రముఖ జన్యు (జెనెటిక్) శాస్త్రవేత్త అయిన జె.బి.ఎస్.హాల్డేన్ గారు ఓ సందర్భములో తెలుగు భారత దేశానికి జాతీయ భాష కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పారు.
    • క్రీస్తు శకం మొదటి శతాబ్దము లో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి.
    • అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళముల తో బాటు తెలుగు భాషను అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది.
    • తెలుగులో, 16 అచ్చులు, 3 విశేషఅచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు కలవు.
    • తెలుగు, భారత దేశం లోని ప్రాంతీయ భాషలలో మొదటి స్థానం లోను, ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో పదమూడవ స్థానములోనూ, భారత దేశములో జాతీయ భాషయిన హిందీ తర్వాత రెండవ స్థానములోను నిలుస్తుంది.
    • తెలుగు ఇతర భాషా పదాలను సులభంగా అంగీకరిస్తుంది
    • ప్రపంచంలోని అతి కొద్ది క్రమబద్ధీకరించబడిన భాషలలో తెలుగు ఒకటి.
    • తెలుగు వ్యాకరణము చాలా తేలికగానూ, నిర్మాణపరంగా అతి శుద్ధంగానూ ఉంటుంది.
    • త్యాగరాజు, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య, అన్నమయ్య, వంటివారు తమ తమ కృతులతో, కీర్తన లతో, తెలుగును సంగీతపరంగా సుసంపన్నం చేసినారు
    • తెలుగు భాషలో ఒక ప్రముఖమైన విషయము ఏమిటంటే సంధి. రెండు పదాలు పక్కపక్కన చేర్చి పలికినప్పుడు మనకు క్రొత్త మూడవ పదము వస్తుంది.
    • తెలుగు భాష మూలపురుషులు యానాదులు.
    • తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు
    • తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దమునకు చెందినది.
    • చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.
    • 10 వ శతాబ్దపు పారశీక చరిత్రకారుడు అల్ బిరుని తెలుగు భాషను 'ఆంధ్రీ' యని వర్ణించెను.
    • 11వ శతాబ్దము ఆరంభమునుండి 'తెలుంగు భూపాలురు', 'తెల్గరమారి', 'తెలింగకులకాల', 'తెలుంగ నాడొళగణ మాధవికెఱియ' వంటి పదాలు శాసనాల్లో వాడబడ్డాయి.
    • 11వ శతాబ్దములో నన్నయ భట్టారకుని కాలమునాటికి తెలుగు రూపాంతరముగా "తెనుగు" అనే పదము వచ్చినది.
    • 13వ శతాబ్దములో మహమ్మదీయ చారిత్రికులు ఈ దేశమును "తిలింగ్" అని వ్యవహరించారు.
    • వ్యాకరణపరంగా, తెలుగులో కర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి.
    • అశోకుని కాలములో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాషనుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. అశోకుడి కాలానికి చెందిన బ్రాహ్మి లిపి రూపాంతరమైన భట్టిప్రోలు లిపి నుంచి తెలుగు లిపి ఉద్భవించింది.
    • తెలుగు భాష అక్షరాలకు యూనికోడ్ బ్లాకు 0C00-0C7F (3072-3199) ఇవ్వబడినది.
  • బ్రిటీష్ వారి కాలంలోనే వెలుగొందిన మన తెలుగు వైభవం

    బ్రిటీష్ వారి కాలంలోనే వెలుగొందిన మన తెలుగు వైభవం

    అణామన తెలుగు బాష యొక్క ప్రాముఖ్యతను బ్రిటీష్ వారు సైతం గుర్తించారు అనటానికి నిధర్శనం వారు ముద్రించిన కరెన్సీ “అణా

    “అణా” అని హింది, బెంగాలీ, ఉర్ధు లతో పాటుగా తెలుగులో ముద్రించారు. మరే ఇతర బాషలను వాడలేదు. వారి కాలంలో దేశంలో తెలుగు మాట్లాడే వారు మూడవ స్థానంలో ఉండటమే దీనికి కారణం.

    అణా

  • తెలుగు వారందరికీ

    తెలుగు వారందరికీ

    తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

     

    తెలుగ దేలయన్న దేశంబు తెలుగేనుతెలుగుతల్లి
    తెలుగు వల్లభుండ తెలుగొకండ
    ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
    దేశ భాషలందు తెలుగు లెస్స

  • మన తెలుగుకు మళ్లీ వెలుగు

    మన తెలుగుకు మళ్లీ వెలుగు

     తల్లిపాల మాధుర్యాన్ని తలపించేదే అమ్మభాష. అలాంటి మన తెలుగు, నేడు ఆంగ్ల ప్రభావంవల్ల చిక్కిశల్యమైపోతోంది. తెలుగు భాషావికాసోద్యమం మళ్ళీ మొదలైతే తప్ప, పరిస్థితి చక్కబడదు. విజయవాడలో నిన్న ప్రారంభమైన ‘ప్రపంచ తెలుగు రచయితల రెండో మహాసభ’లో పాల్గొన్న వక్తల ప్రసంగాల సారాంశమిదే. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ‘ఈనాడు’ సంపాదకులు రామోజీరావు- భాషోద్ధరణ పాఠశాలనుంచి మొదలుకావాలన్నారు. వాడుకే భాషకు వేడుక అవుతుందని స్పష్టంచేశారు. తెలుగు భాష పునరుజ్జీవానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆ కృషికి ‘తెలుగు రచయితల మహాసభ’ నాంది పలకాలన్నారు. రామోజీరావు ప్రసంగం పూర్తిపాఠమిది…

    మాతృభాష మీద మమకారంతో, ప్రేమతో మీరందరూ ఎంతో దూరాలనుంచి వచ్చారు. ఇది నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇదొక బృహత్‌ యజ్ఞం. దీన్ని నిర్వహిస్తున్న కృష్ణాజిల్లా తెలుగు రచయితల సంఘాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అమ్మభాష గురించి మాట్లాడటం అంటే తల్లిపాల మాధుర్యాన్ని తనివితీరా మననం చేసుకోవడమే. తెలుగు గడ్డపై పుట్టడం ఎన్నో జన్మల తపోఫలమని కొందరు మహాత్ములన్నారు. అంతెందుకు- జాతీయభాష కాగల అర్హత తెలుగుకు మాత్రమే ఉందని జేబీ హేల్డెన్‌ లాంటి విదేశీయుడే మెచ్చుకున్నాడు.

    తెలుగు ఒక భాష మాత్రమే కాదు. ఒక సంస్కృతి… ఒక సంప్రదాయం… ఒక జీవన విధానం. ఆ మాటకొస్తే, ఏ జాతికైనా చైతన్యం కలిగించేది భాషే. ఒక జాతి ప్రజల కట్టుబాటును మతంకన్నా భాషే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. బంగ్లాదేశ్‌ అనుభవమే ఇందుకు ఉదాహరణ. భాషను, సంస్కృతిని నిలబెట్టుకుంటేనే తెలుగుజాతి కలకాలం వర్ధిల్లుతుంది. నిజానికి మన భాషకేం తక్కువ? దేశంలో హిందీ తరవాత ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగే. అయితే… ఆంగ్ల ప్రభావంవల్ల మన భాష చిక్కి శల్యమైపోతోంది.

    మన ఆలోచనల్లో, ఆచార వ్యవహారాల్లో తెలుగుదనం కరిగిపోతోంది… తరిగిపోతోంది. ఇందువల్ల మన సంస్కృతి, సంప్రదాయం, మానవ సంబంధాలు… అన్నీ దెబ్బతింటున్నాయి. రానురాను తెలుగుదనం ఉనికే పోతుందా అన్న భయం కలుగుతోంది. 30శాతం ప్రజలకు సొంత భాష చదవడం, రాయడం రాకపోతే ఆ భాష అంతరించిపోతుందని యునెస్కో చెప్పింది. ఈ కష్టం… ఈ నష్టం తెలుగుకు రాకూడదు. ఈ బాధ్యత మన భుజస్కంధాలమీద ఉంది. ఇందుకు ఎవరికి వాళ్లు ముందుకు రావాలి. మనరాష్ట్రంలో పిల్లల్ని గమనించండి… ఆంగ్లపదం రాకుండా ఒక్క నిమిషం కూడా తెలుగులో మాట్లాడలేరు. కారణాలేమైనా చక్కటి తెలుగు రాయడం, మాట్లాడటం, చదవటం అపురూపమైపోతోంది.

    వాడుక… భాషకు వేడుక

    ఏదైనా మాతృభాషలో నేర్చుకుంటేనే పిల్లలకు బాగా ఒంటపడుతుంది. అది తెలిసినా తల్లిదండ్రులు ఏమీ చేయలేకపోతున్నారు. అది వాళ్ల తప్పు కాదు. ఎవరికైనా పిల్లల భవిష్యత్తే ముఖ్యం కదా? పిల్లల చదువుసంధ్యలు, వాళ్ల భవిష్యత్తు ఒకపక్క- మాతృభాష అయిన తెలుగు భవిష్యత్తు ఒకపక్క. ఈ రెండూ ఒకదాంతో ఒకటి ముడివడి ఉన్నాయి.

    తెలుగు భాషమీద మొహంమొత్తి ఇంగ్లిషు వ్యామోహం పెరిగిందా అంటే, అదీ కాదు. ఏ భాషకైనా తప్పకుండా బహుముఖ ప్రయోజనం ఉండాలి. మొదటిది… చెప్పిన మాట ఎదుటివారికి స్పష్టంగా అర్థం కావాలి. ఇది సామాజిక ప్రయోజనం. భాష ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఉపయోగపడాలి. ఇది ఆర్థిక ప్రయోజనం. ఈ ప్రయోజనాలు నెరవేర్చినప్పుడే భాష రోజువారీ వ్యవహారంలో ఉంటుంది. భాషా సంస్కృతులు బాగున్న జాతి జీవకళతో ఉప్పొంగుతుంటుంది. ఇది ఎక్కడి విషయమో కాదు… మన ఇరుగు పొరుగును చూడండి. తమిళులు, కన్నడిగులు, మలయాళీలు, మరాఠీలు ఉన్నారు కదా!. భాషా సంస్కృతుల్ని ప్రాణంగా చూసుకుంటారు. వాటిని ఆత్మగౌరవ చిహ్నాలుగా చేసుకున్నారు. రేడియో, టీవీ, సెల్‌ఫోన్‌ వంటి ఇంగ్లిషు మాటల్ని కూడా వెంటనే తమిళ భాషలోకి అనువాదం చేసుకున్నారు. చివరికి డెంగీ, స్వైన్‌ ఫ్లూ లాంటి కొత్త వ్యాధులకూ తమిళ పేర్లున్నాయి. ఎక్కడో తప్ప ఆంగ్ల పదజాలానికి వారు దాసోహం కాలేదు. తమిళుల ధోరణి మిగతా భాషల వారందరికీ ఆదర్శం. ఒకటినుంచి పదో తరగతి దాకా ప్రతి విద్యార్థీ తమిళం నేర్చుకోవాలని అక్కడ నిబంధన పెట్టారు. తమిళంలో చదివినవారికే అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలిస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమిళ భాషపై పరిశోధనలను బాగా ప్రోత్సహిస్తుంది. ఎప్పటికప్పుడు ఆంగ్ల పదాలకు తమిళ సమానార్థకాలను రూపొందించడంలో వాళ్లు తలమునకలవుతుంటారు.

    పొరుగు దేశాల సంగతి తీసుకుందాం… చైనా రెండు భాషల పద్ధతి పాటిస్తుంది. అందువల్ల ఆ దేశ ప్రజలు స్థానిక సంస్కృతిని, సంప్రదాయాన్ని, అస్తిత్వాన్నీ ఏ మాత్రం పోగొట్టుకోకుండానే అంతర్జాతీయ స్థాయిని అందుకుంటున్నారు. సమకాలీన పరిస్థితులనుబట్టి అక్కడి పాఠశాలల్లో బోధించే మాతృభాషను నిత్యనూతనంగా మలచుకుంటున్నారు. ఫ్రెంచ్‌ ప్రభుత్వమూ ఇలాంటి కృషే చేస్తోంది. మరి అలాంటి భాషాచైతన్యం, కట్టుబాట్లు మనకెందుకు లేవు? మనరాష్ట్రంలో అధికార భాష తెలుగు. ప్రభుత్వ ఉత్తర్వులు, ఉత్తరప్రత్యురాలు… అన్నీ తెలుగులో ఉండాలన్న నిబంధనలకు లోటు లేదు. అయితేనేం… రాజ్యమేలుతున్నది ఇంగ్లిషే!

    ఆంధ్రప్రదేశ్‌ అవతరణ సందర్భంగా మన తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చెప్పారు… ప్రతి రాష్ట్రానికి మాతృభాషే అధికార భాషగా ఉండాలని… పరిపాలన వ్యవహారాలన్నీ మాతృభాషలోనే జరగాలని. ఇప్పటికి అయిదున్నర దశాబ్దాలైంది. ఆంధ్రప్రదేశ్‌ ఆంగ్లప్రదేశ్‌ అయింది తప్ప- తెలుగు వాడకం పెరగలేదు. ఇతరులను చూసి నేర్చుకోవడం కూడా మనకు కరవైపోయింది. అమెరికా రాయబార కార్యాలయ సిబ్బంది రోజుకు ఎనిమిది గంటల చొప్పున, ఎనిమిది నెలలపాటు కష్టపడి తెలుగు నేర్చుకున్నారట. మరి మనమో? తెలుగులో మాట్లాడటం, రాయడం నామోషీ అనుకుంటున్నాం. భాషా ప్రేమికులైన ఒకరిద్దరు అధికారులో, న్యాయమూర్తులో తెలుగులో ఉత్తర్వులు జారీచేస్తే దాన్నే గొప్పగా చెప్పుకొంటున్నాం.

    ఇప్పటికైనా మించిపోయింది లేదు. తెలుగు భాషా వికాసోద్యమం మళ్లీ మొదలు కావాలి. ఇందుకు రెండు రకాల ప్రయత్నాలు సాగాలి. తెలుగువల్ల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ప్రయోజనాలుండేట్టుగా ప్రభుత్వ విధానాలు రూపుదిద్దుకోవాలి. తెలుగు వస్తేనే తమ బిడ్డలకు భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులకు నమ్మకం కలగాలి. అప్పుడే తమ పిల్లలు తెలుగు నేర్చుకోవడంమీద వాళ్లు సుముఖత చూపిస్తారు. సమాజం పెరిగేకొద్దీ భాష పెరుగుతుంది. విజ్ఞానం పెరిగేకొద్దీ భాష విస్తరిస్తుంది. ఈ క్రమంలో తెలుగు కూడా ఆంగ్లంతో పోటీపడి పెరగాలి. మనం వెనకబడితే భాష కూడా వెనకబడుతుంది. ఇంగ్లిషు మీద విముఖత అక్కర్లేదు. తెలుగు పట్ల సుముఖతను పెంచుకోవాలి.

    తెలుగులోనే మాట్లాడటం, చదవటం అంటే ఇంగ్లిషుకు వ్యతిరేకం కానే కాదు. ఇది అందరికీ స్పష్టం చెయ్యాలి. మనది అందరి భాష… ఎవరికీ అందని భాష కాకూడదు. ఇందుకు ప్రభుత్వం చెయ్యాల్సినవి కొన్ని… ప్రజలు చెయ్యాల్సినవి ఇంకొన్ని. భాషకు పట్టం కట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఇందుకు సమాజంనుంచి ఒత్తిడి రావాలి. భాషోద్ధరణ పాఠశాలనుంచే మొదలు కావాలి. ఒకటో తరగతినుంచి పట్టభద్రస్థాయి దాకా తెలుగు భాషను తప్పనిసరి పాఠ్యాంశంగా చెయ్యాలి. ఇక్కడ మరో విషయం చెప్పాలి… పాఠ్యపుస్తకాల్లో ఉండే తెలుగు- పిల్లల్ని భయపెట్టేలా ఉండకూడదు. తేనెలొలికే తెలుగుమీద వాళ్లకు ఆసక్తి పెంచేట్టుగా ఉండాలి. ఇందుకోసం పాఠ్యపుస్తకాల్లోని పదజాలాన్ని ఇంకా సరళీకరించాలి. ఆంగ్ల పదాల వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి భాషాప్రియులు నడుం కట్టాలి.మన వ్యవహారంలోకి వచ్చిపడుతున్న ఆంగ్ల శబ్దాలకు ఎప్పటికప్పుడు తెలుగు మాటలను సృష్టించాలి. అయితే ఒక జాగ్రత్త తీసుకోవాలి. సమానార్థకాలు తయారు చేసేటప్పుడు అవి వినడానికి ఇంపుగా, తేలిగ్గా ఉండాలి. కొరుకుడు పడని పదాలైతే నష్టం వాటిల్లుతుంది.

    తెలుగు అనగానే ఏ తెలుగు అన్న మీమాంస అనవసరం. యాస భాషకు బలం. లక్షలమంది మాట్లాడే మాండలికాలన్నీ భాషకు ఆయువుపట్టులే. అవన్నీ అవసరమే. అసలు సిసలైంది జనభాషే. మంచి మంచి తెలుగు మాటలను ప్రసార సాధనాల్లోకి తెచ్చుకుంటే భాష అందగిస్తుంది. ఈ క్రతువులో పండితులే కాదు… భాష మీద ప్రేమ, అవగాహన ఉన్న సామాన్యులు కూడా పాలుపంచుకోవాలి. నిజమైన భారతదేశం గ్రామాల్లో ఉందంటారు. నా దృష్టిలో నిజమైన భాష పల్లెపట్టుల్లోనే ఉంటుంది. అక్కడ వాడుకలో ఉన్న పదాలను అందరం వాడుకుందాం. ఆ వాడుక తెలుగు భాషకు వేడుక అవుతుంది. డ్రెడ్జర్‌ అనే మాటకు ‘తవ్వోడ’ అన్న పదాన్ని సృష్టించింది సామాన్యులే. వారి అవసరార్థం దాన్ని కనిపెట్టారు. డ్రిప్‌ ఇరిగేషన్‌కు చుక్కల సాగు కూడా అలా వచ్చిందే. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ అందరి వాడుకలోకి రావాలి. అప్పుడే మన భాష మరింత శక్తిమంతమవుతుంది.

    మరో మహోద్యమం

    భాష, సంస్కృతి… రెండూ విడదీయరానివి… ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉన్నవి. అందుకే పిల్లలకు ఇవన్నీ నేర్పాలి. ఒక్క ఆంగ్ల శబ్దం కూడా రాకుండా తెలుగులో మాట్లాడేలా, రాసేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. వక్తృత్వం, వ్యాసరచన, సామెతలు, శతక పద్యాలు, కీర్తనలు వంటివాటిలో పోటీలు పెట్టాలి. విజేతలకు బహుమతులివ్వాలి. పాల్గొన్నవారందరినీ ఏదోరకంగా ప్రోత్సహించాలి. అవకాశం ఉన్నవారు తమ ఇళ్లలో కూడా పిల్లలచేత కసరత్తు చేయించాలి. ప్రోత్సహించాలి. పిల్లల్లో తెలుగు చదవాలన్న ఆసక్తిని, రచనాశక్తిని మనం పెంపొందించాలి. అందమైన తెలుగులో చిన్నారులను ఆకట్టుకునే కథలు, పుస్తకాలు విరివిగా రావాలి. వాటివల్ల భాషమీద, సంస్కృతిమీద మమకారం పెరుగుతుంది.

    మన భాషాసంస్కృతులు మనకు అమూల్య ఆస్తులు… మన వారసత్వ సంపద. వాటిని మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడతారు? ప్రపంచం మొత్తంమీద ఉన్న 12కోట్లమంది తెలుగువారి ఉనికికి సంబంధించిన విషయం ఇది. దీనికి ఎటువంటి ప్రమాదం రాకుండా అడ్డుకుందాం. 1822లో రాజా రామ్మోహన్‌రాయ్‌ సొంత సొమ్ముతో ఒక పాఠశాలను పెట్టారు. అందులో శాస్త్ర సాంకేతిక విషయాలను కూడా బెంగాలీలోనే బోధించే ఏర్పాట్లు చేశారు. ఆ మహానుభావుడే మనకు స్ఫూర్తి కావాలి. ఫ్రెంచ్‌ దేశస్తులు వాళ్ల కళలు, సంస్కృతిని కాపాడుకోవడానికి రెండు శతాబ్దాలపాటు సాంస్కృతిక పునరుజ్జీవన విప్లవం చేశారు. ఇది చరిత్ర. మన దగ్గర కూడా అలా చరిత్ర సృష్టించాలి. ‘తెలుగు భాషా పునరుజ్జీవన ఉద్యమం’ సాగాలి. ఈ మహాసభలు ఇందుకు నాందీ ప్రస్తావన చెయ్యాలి. భాషాప్రియులుగా మీరున్నారు. మీకు తోడుగా మేమూ ఉన్నాం.

    తెలుగు భాషా పునర్వికాసానికి కృషి చేసేందుకు ఈనాడులో ‘తెలుగు వెలుగు’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఆంగ్ల పదాలకు ప్రత్యామ్నాయాలు, సమానార్థకాల అన్వేషణ, పద సేకరణ, నూతన పదాల్ని సృష్టించడం, వాటిని వ్యాప్తిలోకి తేవడం… వంటివాటిపై ఈ విభాగం పనిచేస్తుంది. నా ఆకాంక్ష ఒక్కటే… తెలుగు భాష కొత్త పుంతలు తొక్కాలి. అగ్రగామిగా నిలవాలి. తెలుగు సంస్కృతి, వైభవం ఎప్పటికీ జీవనదిలా ప్రవహించాలి. ఇప్పటికే జాప్యం జరిగి ఉండవచ్చు. ఇక కాలయాపన తగదు. నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందడుగు వేస్తారని ఆశిస్తూ… సెలవు తీసుకుంటున్నాను.

     

  • తెలుగు బాష ప్రాముఖ్యత (ప్రథమ బహుమతి పొందిన వ్యాసం)

    తెలుగుభాష యొక్క ప్రాముఖ్యత

    ఉపోద్గాతము :  “చక్కని పలుకుబడులకు, నుడికారములకు తెలుగు బాషయే పుట్టినిల్లు ”. చక్కని కవితలల్లిక లో జిగిబిగిని ప్రదర్శించిన నేర్పు ఈ బాషలోనే వీలైనది. అంతేగాక, అనేక బాషలు ఈ బాషలో చోటు చేసుకున్నాయి. ఎప్పుడైనా ఒక బాష  గొప్పతనం అన్ని బాషలూ నేర్చినగానీ తెలియదు. సంస్కృతము, తమిళము, పారసి మున్నగు బాషలు తెలిసిన రాయలు దేశబాషలందు  తెలుగులెస్స అనుట ఆశ్చర్యం గాదు. బ్రౌనుదొర కూడాఈ బాషను గూర్చి వేనోళ్ల పొగుడుట మన తెలుగు వారి, తెలుగు బాష యెక్క గౌరవము.

    దేశ బాషలందు తెలుగు లెస్స: మన తెలుగు బాష దేశ బాషలలో గొప్పది. దేశబాషలందు తెలుగులెస్స, అని శ్రీకృష్ణదేవరాయలు తన “ఆముక్తమాల్యద” లో ఆంధ్రమహావిష్ణువు చే చెప్పించాడు. ఈ మాట ప్రతి తెలుగు వారి గుండెలలో నిరంతరం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. రాయల పైమాట తెలుగు వారి యెక్క మాతృబాషాభిమానానికి మేలుకొలుపు పాట అయ్యింది. బహుబాషా కోవిదుడైన రాయలు, ఆ బాష లోతుపాతులనెరిగి, మధించి భువన విజయ వికమాదిత్య న్యాయాధిపతిగా చెప్పిన తీర్పు దేశబాషలందు  తెలుగులెస్స అన్న మాట.

    తెలుగు  బాష మాధుర్యం:   తెలుగు బాష మాధుర్యానికి కారణాలను పరిశేలిద్దాం. తెలుగు ద్రావిడ బాషలలో నుండి పుట్టింది. సహజముగా ద్రావిడ లక్షణములను బట్టి సరళము, సుకుమారము అయిన తెలుగువాణి, సంస్కృత బాషా కైకర్యం, గాంభీర్య పటుత్వాలను అలవరుచుకొని, తల్లికి, అక్కా చెల్లెండ్రకూ లేని క్రొత్త అందాలను అలవరుచుకుంది.

    తెలుగు బాష సస్యశ్యామలమైనది: తెలుగు గడ్డ కవితా సస్యశ్యామలమైనది. సహృదయ సామ్రాట్ అయిన శ్రీకృష్ణదేవరాయలు ఏ బాష వాడైనా, తెలుగు బాషకే కావితాకర్పూర నీరాజనం అందించాడు.

    “తరిపి వెన్నెల! ఆణిముత్యాల జిలుగు
    పునుగు జివ్వాజీ! ఆమని పూల వలపు
    మురళి రవాళులు! కస్తూరి పరిమళములు
    కలిసి ఏర్పడే సుమ్ము మా తెలుగు బాష” అని నండూరి వారు అన్నారు.

    తెలుగు బాష  కోటి కిటికీల గాలి మేడ:  తెలుగు బాష   కొల్లలుగా క్రొత్త పదాలను తనలో కలుపుతుంది.తెలుగు బాష  కోటి కిటికీల గాలి మేడ. అన్నీ వైపుల నుండి వీచే గాలులను ఆహ్వానించి, ఆతిధ్యమిచ్చి గౌరవించింది. తెలుగుకి గల హృదయ వైశాల్యము అనన్యము. తెలుగు,సంస్కృత పదాలు క్షీరనీర న్యాయంలో కలిసిపోతాయి. అదే తెలుగు బాష విశిష్టత.

    మన తెలుగు కవులు: నన్నయ, తిక్కన, ఎఱ్ఱన తెలుగు పాండిత్యము తో మెప్పించిన ఉద్ధండ కవులు. మన తెలుగు కవులు అపార ప్రజ్ఞాధురీణులు. సంస్కృతాంధ్ర పదములు ప్రయోగించటం లో నేర్పరులు. పోతన సంస్కృతాంధ్ర పధములు ఇష్టమైన ఇద్దరినీ మెప్పిస్తానన్నాడు. పెద్దన మనుచరిత్ర లో ఇంతలు కన్నులుండ అని వ్రాసిన పధ్యము లోని తేట తెనుగు నుడికారపు సొంపులు, వంపులు, తామర తంపరలు, అల్లసాని వారి ఆ అల్లికజిగిబిగి లో తెలుగు పదములు, సంస్కృత శబ్ధములు పడుగుపెకల వలె అల్లుకుంటాయి. మన తెలుగు కవులంతా ఈ విధ్యలో నేర్పరులే. తెలుగు కవులకు జరిగిన సత్కార గౌరవములు ప్రపంచములో ఏ దేశంలో ఏ కవులకూ జరగలేదు.

    తెలుగువారి సహృదయత, సాహితీ రసికత, నిరుపమానములు. తెలుగు బాష వాజ్మయము లో ప్రాతఃస్మరణీయులు కవిత్రయము, నన్నయ్య ను రాజరాజు ఆదరించాడు. తిక్కన ను మనుసిద్ది, ఎఱ్ఱప్రెగడను వేమారెడ్డి గౌరవించారు. శ్రీనాథుడు రెడ్డి రాజుల కవిగా మహాభోగాలు అనుభవించాడు. ఆయనకు ప్రౌఢధేవరాయులు కనకాభిషేకం చేశాడు. పోతన మహాకవికి తమ హృదయంలోనే దేవాలయాలు కట్టి తెలుగువారు నేటికీ ఆరాదిస్తారు. సాహితీ బొజుడైన కృష్ణదేవరాయులు కవులను పూజించిన విషయము జగత్ ప్రసిద్దము. పెద్దన కవికి రాయులు గండపెండేరము తొడిగి గౌరవించాడు.

    Telugu is the Italian of the East: తెలుగు బాష సంగీతానికి అనువైన అజంత బాష. తెలుగు ఆజన్మ సంగీత కవచకుండలాలతో భాసించింది. సంగీత కళారాధనలో మన తెలుగు వారికి కలసి వచ్చిన గొప్ప అదృష్టం మన మాతృ బాష తెలుగు. తెలుగు బాషలో వచనానికి కూడా సంగీత సాహచర్యం ఉంది. తెలుగు పాటలో, పధ్యములో సంగీత సాహిత్యాలు గంగాయమున వలే సంగమించి ఉంటాయని సహృధయులందరికీ విదితమే. పధ్య కవిత్వంతో పాటు తెలుగు బాషలో వెలసిన పాటలు, స్త్రీల పాటలు, గేయాలు, కీర్తనలు, మరి ఏ ఇతర బాషల్లోనూ లేవు. రామధాసు కీర్తనలు తెలుగు దేశమంతా వ్యాపించాయి. తాళ్ళపాక అన్నమాచార్యులు ముప్పై రెండు వేల కీర్తనలు రచించాడు. తెలుగు వారి కళాభినివేశమునకు, మూర్తీభవించిన పారాకాష్ట త్యాగరాజు.

    మాతృబాషలో విధ్యాబోధన:  గాంధీజీ 1938 లో తన హరిజన పత్రికలో బాలబాలికలకు ఆంగ్లము ద్వారా విధ్యాబోధన చెయ్యడాన్ని తప్పు పట్టారు. నిజమైన భావ ప్రేరేపణ, ప్రగతి, మాతృబాష వల్లనే వస్తుందని, స్వబాషలో విధ్య ఉంటే, మనకు స్వరాజ్యం ఎప్పుడో వచ్చేదని ‘గాంధీజీ’ వ్రాశారు. మాతృబాషలో విధ్యాబోధన వల్ల మనసులు చురుకుగా పనిచేస్తాయని, రవీంధ్రుడు అన్నాడు.

    మాతృబాషలో  విధ్యాబోధన వల్ల గ్రహణ సామర్ధ్యం పెరుగుతుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. “మాతృబాషలో విధ్యాబోధన వల్ల విధార్ధులలో సృజనాత్మకత పెరుగుతుంది”.

    మాతృబాష తల్లి పాల వంటిది. పరబాష పోతపాల వంటిది.అని కొమర్రాజు లక్ష్మణరావు గారు అన్న మాట సత్యము.

    అధికార బాషగా తెలుగు: తెలుగును పరిపాలనా బాషగా చేయాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. చివరకు 1966 లో తెలుగును అధికారాబాష గా ప్రవేశపెట్టిన బిల్లు చట్టం అయింది. ప్రబుత్వ శాఖలు తెలుగులోనే ఉత్తర ప్రత్యుత్తరాలు నడపాలని 1966 డిసెంబర్ లో ఉత్తర్వులు వచ్చాయి. పరిపాలనా బాషగా తెలుగు స్వరూపం ఎలా ఉండాలో నిర్ణయించటానికి పింగళి లక్ష్మీకాంతం, జి.ఆర్.పి గ్విన్ ల అధ్యక్షతన సంఘాలు ఏర్పడ్డాయి. ప్రబుత్వంలో ఒక శాఖగా 1974 మార్చి 19 న “అధికార బాష సంఘం” ఏర్పడింది.

    తెలుగు భోదనా భాషగా అమలుకు సూచనలు:  ప్రజాస్వామ్య యుగంలో ప్రజల బాషలో పరిపాలన సాగించాలి. పాలకుల బాష ఒకటి, పాలితుల బాష మరొకటి అయితే, పరిపాలన అడవిని కాచిన వెన్నెల అవుతుంది. ప్రజలకి తమ బాషలో సమస్యలని చెప్పుకొనే హక్కు ఉండాలి. అధికారులు తెలుగులో వివరించే బాధ్యతని కలిగి ఉండాలి. మాతృబాషలో విధ్యార్జన సులభం. ఇది గమన సామర్ధ్యాన్ని, జ్ఞానాన్ని వేగవంతం చేస్తుంది, సృజనాత్మకతకు తోడ్పడుతుంది. అయితే తెలుగు బాషను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ది చెయ్యాలి.

    • తెలుగులో పాఠ్యగ్రంథాలను ప్రచురిస్తూ, వాటిని మధ్యమధ్యన పరిష్కరిస్తూ ఉండాలి
    • సమగ్రమైన పారిభాషిక పద కోశాల్ని తయారుచేయించాలి.
    • వైజ్ఞానిక, సామాజిక విషయాలపై గ్రంథాలను విరివిరిగా అనువాదం చేయించాలి.
    • ప్రభుత్వము, తెలుగు అకాడమీ, విశ్వవిధ్యాలయాలు వంటి ద్వారా అన్ని స్థాయిలలో, తెలుగు బోధనా బాషగా అమలు చేసేంధుకు వీలుగా గ్రంథాలు రాయించాలి.
    • ప్రజల్లో చైతన్యం వచ్చి, ధీక్షతో, పట్టుదలతో తెలుగును బోధనా బాషగా అమలు చేయటంలో సహకరించాలి.
    • తెలుగును బోధనా బాషగా చదివిన వారికి సాధుపాయాలు కల్పించాలి.
    • తెలుగులో ఐ‌ఏ‌ఎస్, ఐ‌పి‌ఎస్ వంటి ఉన్నత పరీక్షలు వ్రాసే పద్దతిని అమలు చెయ్యాలి.
    • ప్రబుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులు పూర్తిగా తెలుగులోనే ఉండాలి.
    • టైప్ రైటింగ్, షార్ట్ హాండ్, కంప్యూటర్ లలో తెలుగుకి ప్రాధాన్యం కల్పించాలి.

     సమాప్తి:

    • తెలుగు బాష పట్ల మమకారం అంకిత భావం ఉండాలి.
    • ప్రజల వద్దకు పాలన అన్నది తెలుగు బాషను పరిపాలనా బాషగా పూర్తిగా అమలు పరిచినప్పుడే సాధ్యమవుతుంది.
    • అభిమానం మాటలకే పరిమితమైతే దేశ బాషలందు తెలుగు లెస్స్”  అనే పరిహాసానికి గురికాక తప్పదు. కాబట్టి ప్రభుత్వం తెలుగు పట్ల శ్రద్ద వహించాలి.
    • అధికారులు, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి. అప్పుడే తెలుగు వెలుగు నాలుదిక్కులా వ్యాపిస్తుంది.
    • ఈ విధంగా తెలుగును భోధనా బాషగా ప్రవేశపెట్టి, మన విధ్యార్థుల సర్వతోముఖ వికాసానికి ఫ్రబుత్వము, ప్రజలు కృషి చేయాలి.

     కూన రసజ్ఞ,
    10వ తరగతి,
    శ్రీ సరస్వతి జ్ఞాన మందిర్ ఉన్నత పాఠశాల,
    బుధవార్ పేట్, నిర్మల్,
    నిర్మల్ (మం), ఆధిలాబాద్ జిల్లా.

  • తెలుగు బాష ప్రాముఖ్యత (ధ్వితీయ బహుమతి పొందిన వ్యాసం)

    మాతృ బాష యొక్క ప్రాముఖ్యత

    ఉపోధ్ఘాతం:

    మాతృమూర్తిపై, మాతృభూమిపై, మనసున్న ప్రతి మనిషికీ అవ్యాజమైన ప్రేమ, గౌరవం ఉంటుంది. అందుకే, “మాతృదేవోభవ” అని మనకు జన్మనిచ్చిన తల్లిని మొట్టమొదటగా స్మరించుకుంటున్నాం. ‘తల్లి ఒడి మొదటి బడి’ అన్నారు. వ్యక్తి జీవితంలో మొదట నేర్చుకునే బాష మాతృబాష. “జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాధపి గరీయసి” అనడంలో మాత, మాతృభూమి, స్వర్గం కంటే మిన్న అని తెలుస్తుంది. మాతృబాష సహజంగా అబ్బుతుంది. అప్రయత్నంగా వచ్చేదే మాతృబాష.

     మాతృబాష:

    Mother Tongue అనే ఆంగ్ల పదానికి సమానార్ధకంగా నేడు మాతృబాష అనే పదం వ్యవహారంలో ఉంది. శిశువు మొట్టమొధటిసారిగా తానొక బాషను నేర్చుకుంటున్నాననే జ్ఞానం లేనప్పుడు, తనలో ఉన్న అనుకరణ అనే సహజ ప్రవృత్తితో తన పరిసరాలలోని వారి బాషణాన్ని అనుకరిస్తూ, జీవితంలో  మొట్టమొదటిసారిగా నేర్చుకునే బాషే “మాతృబాష”. శిశువు సౌంధర్య దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయటానికి ఉపయోగపడేది మాతృబాష అని గాంధీజీ భావించారు. “దేశ భాషలందు తెలుగు లెస్స” అని సాహితీ సమరాంగణ సార్వభౌముడైన శ్రీ కృష్ణదేవరాయులు ఆముక్తమాల్యధ లో తన ఇష్ట ధైవమైన శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు తో చెప్పించారు.

     మాతృబాష విశిష్టత – ప్రాముఖ్యత:

    మన మాతృబాష తెలుగు. మాతృబాష సహజంగా అలవడుతుంది. అప్రయత్నంగా, సహజంగా వచ్చేది మాతృబాష. ఏ బాషను శిశువు అసంకల్పితంగా మాట్లాడతాడో, ఏ బాష ఇతర బాషల అభ్యసనం పై ప్రభావం చూపుతుందో ఆ బాషనే మాతృబాష అంటారు.

    వ్యక్తిత్వం:

    తెలుగు బాష స్వతంత్రమైన బాష. తెలుగు బాష సహజ స్వరూపం ఈ బాషలోని మూల పదాలైన సంఖ్యావాచకాలు, సంబంధ నామ వాచకాలు,  సర్వనామాలలో కనపడుతుంది.

    లిపి:

    తెలుగువారు మొదటి నుండీ రాత విషయంలో చాలా పట్టింపుతో ఆణిముత్యాల వలే, ముత్యాలకోవ వలే రాసే అలవాటు చేసుకున్నట్లు మన సాహిత్యంలో నిదర్శనాలున్నాయి. దేశంలో లీపులలో లేని అందం తెలుగు లిపిలో ఉన్నట్లు గుర్తించవచ్చు. ప్రస్తుత లిపి సుంధరమై, ఆకర్షణీయంగా ఉంది.

    వర్ణమాల:

    తెలుగు బాషకు ఏ బాషాకూ లేనంత వర్ణమాల ఉంది. ఈ బాషను నేర్చుకోవటం కష్టంగా తోచినా, ఈ వర్ణమాల వలన కలిగే ప్రయోజనం తెలిస్తే దీనిని శ్రమగా భావించలేరు. ఆంగ్లబాషలో వర్ణక్రమం, ఉచ్చారణాలకు పొందిక  లేకపోవటానికి వర్ణమాల చిన్నది కావడమే కారణమని, అంధువల్ల వర్ణమాలను నేర్చుకోవడం సులభమైన ఆ భాషలో పఠన, లేఖన, సంబాషణాదులను అభ్యసించడం కష్టమని అంగీకరించక తప్పధు.

    ఉచ్చారణ:  

    వేధపఠనం విన్నవారికి ఉచ్చరణలో ఉన్న ఆకర్షణ, మాధుర్యం తెలుస్తుంది. అంధుకు మూల కారణం మన బాషలోని స్వర విశేషమే.

    స్పష్టత:

    ఏ బాషకూ లేనంత అచ్చులా సంపద ఉండి, ఆయా బాషలలాగా హలంతంగాక , పద మధ్యంలో అక్షరాలను హల్లులలాగే తేల్చి మింగి పలికే బాష కాకపోవటంతో, ఆ బాషలలో లేని స్పష్టత, అవగాహనా సౌలభ్యం తెలుగు బాషాకు ప్రత్యేక లక్షణాలుగా బాషిస్తున్నాయి.

    శ్రావ్యత:

    తెలుగు బాష అజంత బాష కావటం వలన ప్రతి పదాన్ని స్పష్టంగా పలికే వీలవుతోంది. అజంతమవడంలో ఈ బాషకు స్పష్టతే కాకుండా శ్రావ్యత కూడా సమకూరింది. స్వాతిశయాభిమానానికి పేరువదిన పలువురు సంగీతంలో పారమ్య సంపాదనకు త్యాగరాజ కృతులను అభ్యసింపక తప్పుట లేదనడమే తెలుగుభాషలోని ప్రత్యేకతకు నిదర్శనం.

    మాధుర్యం:

    తెలుగు మాధుర్యం మన దేశీయులనే కాకుండా, విదేశీయులను కూడా ఆకర్షించ గలగడం విశేషం. దీనికి శ్రీ సి.పి బ్రౌన్ తెలుగు బాష గురించి చేసిన ప్రశంసమే తార్కాణం.

    సంధి:

    సంధి ఈ బాషకుగల సహజ లక్షణం.  ఉధా: చింత-ఆకు, ఏమి – అది, ఏమి – అన్నాను, దాని – అంత మొదలగునవి .

    సారళ్యం:

    సంస్కృత బాషలో అరుధైన సారళ్యం తెలుగు బాషలో కుదురుకొని ఉండటం మరొక విశేషం.

    సౌకుమారం:

    దీర్ఘాలైన మాతలుగానీ, సమాసాలుగానీ లేకుండా ఆలతి పదాల కూర్పు తెలుగు భాషా సౌకుమార్యతకు, సోయగానికి వృష్టాంతమవుతుందోంది.

    గాంభీర్యం:

    సంస్కృత భాష నుంచి సంక్రమించిన స్థిరాక్షర మహాప్రాణధుల వల్ల శబ్ధగాంబీర్యం చేకూరి ఎంతటి గంభీర భావాన్నైనా ప్రకటించగల సామర్ధ్యం ఈ బాషకు అలవడింది.

    జంట కట్టుట:

    ఇది ఈ బాషకు గల వేశేష లక్షణం. ఆటా-పాటా, మాటా-మంతి మొదలగునవి.

    యతి ప్రాసలు:

    యతిప్రాసలు ఈ బాషకు జీవగఱ్ఱ. వీటివల్ల దీనికి కలుగుతున్న సొగసు, మాధుర్యం ఇంతింత అని చెప్పలేం. తెలుగువారి వ్యవహారంలో ఇవి అప్రయత్నంగా ప్రత్యక్షమవుతాయి. ఇవి అసామాన్య లక్షణాలు కలిగి ఉండటం వల్లనే “దేశబాషలంధు తెలుగు లెస్స” అని కవి సార్వభౌముడు శ్రీనాథుడు కీర్తించాడు.

    విదేశీయుల ప్రశంశలు:

    ఆనాటి రాయలచేతనేకాక తెలుగుబాష ప్రాచ్య భాషలో మాధురీభరితమై మకుటాయమానము అవుతోందని పాశ్చాత్యులూ ప్రస్తుతించారు. ఆ గౌరవం పొందటానికి తెలుగుబాషకుగల అర్హత మరి ఏ ఇతర బాషలకు లేదని అయితే, విజ్ఞాన సాంకేతిక పదజాలనికది పుట్టినిల్లు కాగలదని వక్కాణించారు.

    అధికార బాషగా తెలుగు:

    ఒక జాతి సాంస్కృతిక అభివృద్దికి కీలకమైన వాటిలో భాష కూడా ఒకటి. ఒక జాతి నాగరికతను, సంస్కృతిని, ప్రజాజీవనాన్ని బాష ప్రతిభింబిస్తుంది. బాష కేవలం భావవ్యక్తీకరణ, బావ ప్రకటన సాధనంగానేకాక, భావాలను సమైఖ్యపరిచి భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించటానికి దోహదం చేస్తుంది. పరిపాలన నిర్వహించడానికి ప్రపంచంలో ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా అత్యధిక సంఖ్యాకులు మాట్లాడే భాష అధికార భాష అవుతోంది.

    బోధన మాధ్యమంగా తెలుగు ప్రయోజనాలు:

    బోధన మాధ్యమంగా తెలుగు ఉండటంవల్ల కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి,

    • మాతృబాషలో విషయాన్ని వ్యక్తం చేయడం, బోధించడం, అభాసించడం సులభం.
    • మాతృభాషలో అధ్యయనం వల్ల కంఠస్థం చేయకుండా భావాలను గుర్తుపెట్టుకొని రాయవచ్చు.
    • మాతృభాషలో విధ్యార్థి స్వయంగా చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకొంటాడు.
    • మాతృభాష మాధ్యమం వల్ల దేశీయ భాషలు అభివృద్ది చెందుతాయి.
    • మాతృభాష మాధ్యమంవల్ల అధ్యయనం చురుకుగా సాగుతోంది.
    • సామాజిక స్పృహ పెంపొందుతుంది.
    • మాతృభాష మాధ్యమంలో విధ్యార్ధులకు అభ్యసనం క్రీడలా తోచి మానసిక శ్రమ, అలసట లేకుండా ఉల్లాసంగా వివిధ విషయాలను సులభంగా నేర్చుకొంటాడు.
    • మాతృభాషా మాధ్యమంలో చదవడంవల్ల ఆ భాషకు తగిన గౌరవం కల్పించిన వారమవుతాం.

    బోధనా మాధ్యమంగా తెలుగులో సమస్యలు:

    బోధనా మాధ్యమంగా తెలుగు అమలులో పలు సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి

    1. అనువాద సమస్యలు
    2. విదేశీ ఉధ్యోగాల సమస్య
    3. పోటీ పరీక్షలలో సమస్యలు

    అనువాద  సమస్య:

    ఆంగ్ల బాషలో ఉన్న గ్రంథాలను తెలుగులోకి అనువదించటం కష్టమని కొందరంటారు. పారిభాషిక పదాలకు సరైన పదాలను తెలుగులో రాయలేమని కొందరు బావిస్తారు.

    నివారణ:

    నన్నయ్యకు ముందు తెలుగులో రచనలు లేనప్పుడు, సంస్కృత పదాలకు కొన్ని చేర్పులు చేసి తెలుగు పధాలుగా తెలుగులో భారతానువాదం చేయలేదా??

    విదేశీ ఉధ్యోగాల సమస్య:

    ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళి ఉధ్యోగాలు చెయ్యాలంటే, తెలుగు మాధ్యమంలో చదివినవారు పనికిరారని, ఆంగ్లమాధ్యమంలో చదివినవారే పనికివస్తారని ఒక అభిప్రాయం.

    నివారణ:

    గతంలో అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేసిన వావిలాల గోపాలకృష్ణయ్య ఏమన్నారో చూడండి. ‘ఇంగ్లీష్ లో చదివిన అందరికీ ఉధ్యోగాలిస్తే, నా ఉధ్యమం మానుకుంటాను’. అమెరికా పోయే నాలుగురికోసం అంతా ఇంగ్లీష్ లోనే చదవాలా?. కానీ మనదేశంలో  తృభాషా సూత్రం ప్రకారం మూడు భాషలు కొన్ని రాష్ట్రాల వారు విధిగా నేర్చుకున్నా, ఆంగ్ల బాషను తప్పకుండా నేర్చుకుంటున్నారు.

    పోటీ పరీక్షలలో సమస్యలు:

    అఖిలభారత సర్వీసులకు, మెడికల్. ఇంజనీరింగ్ వంటి పోత్ర్ర్ పరీక్షలలో ఆంగ్ల మాధ్యమంలో చదివిన విధ్యార్థులే రాణిస్తారని, మాతృబాషలో చదివిన వారు రాణించలేరని అనుకోవడం పొరపాటు. ఈ మధ్యకాలంలో పలువురు గ్రామీణ విధ్యార్థులు, మాతృభాష మాధ్యమంగా చదివినవారు పోటీ పరీక్షలలో, ఉధ్యోగాల అర్హత పరీక్షలలో అత్యుథ్హమ ప్రతిభను ఛాతీ కేంధ్ర సివిల్ సర్వీసెస్ ఉధ్యోగాలకు ఎంపిక అవుతున్నారు.

    ఇతర నైపుణ్యాలు:

    ఉపాధ్యాయుడికి అన్యాశాస్త్రాలు, భాషాసాహిత్యాలు పరిచయం ఉండాలి. తెలుగు భాష పై, సాహిత్యం పై ప్రభావం చూపిన ఇతరదేశ భాషలు, వాటి సాహిత్యాలు పరిచయం ఉండాలి

    ముగింపు:

    ప్రస్తుతం ప్రపంచంలో తెలుగు భాష పలుచోట్ల వాడుకలో ఉంది. ప్రపంచంలో 16వ స్థానంలో ఉంది. దేశంలో రెండవ స్థానంలో ఉంది. ఈ విధంగా తెలుగు ప్రపంచ భాషగా ఒక గొప్ప విశిష్టతను కలిగి ఉంది. అధికార భాషగా తెలుగు అమలుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్దితో వ్యవహరించాలి. సెలవు చీటి ధగ్గర నుండి ఆఫీసు వ్యవహారం వరకు కచ్చితంగా తెలుగునే అమలు చెయ్యాలి

     అల్లు మంగ,
    10వ తరగతి. జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల,
    పెదనందిపల్లి గ్రామం, దేవరాపల్లి మండలం, విశాఖపట్నం జిల్లా

  • తెలుగు బాష ప్రాముఖ్యత (తృతీయ బహుమతి పొందిన వ్యాసం -౨)

    తెలుగు బాష ప్రాముఖ్యత 

     “దేశ  భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు వారు అన్న మాటకు అర్థం మన దేశంలో ఎన్నిభాషలున్నా సరే ఏ భాష కూడా తెలుగుతో పోటీ పడలేదు అని. తెలుగు భాషలోని మాధుర్యం అంతా ఇంతా కాదు. ఉగ్గు పాల నుండి ఒక బిడ్డకి తల్లి పాట పాడేందుకు వీలైన భాష.తెలుగు భాషలోని స్పష్టత, నేర్పు, భావం, కూర్పు చాలా అందంగా ఉంటాయి. ఎందరో మహనీయులు, కవులు, కవయిత్రులు మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను గురించి చాటిచెప్పారు.

    అందులో ప్రప్రధమంగా  నన్నయ, తిక్కన, యెఱ్ఱాప్రగడలు మహాభారతం వంటి గొప్పకావ్యాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి, సామాన్య మనవుడికి అర్థమయ్యే విధంగా, చక్కగా అనువదించారు.ఆ కవిత్రయానికి జోహార్లు. వీరేకాక, గురజాడ అప్పారావు, వీరేశలింగం పంతులు, శ్రీశ్రీ, సి.నా.రె మొదలైన కవుల వరకు అందరూ ఎన్నో గొప్ప తెలుగు కావ్యాలు, కథలు రచించారు.

    తెలుగులో కవిత్వం మన ఆది కవి “నన్నయ” గారి మహాభారతం నుండి అంటే 11వ శతాబ్దం నుండి మొదలైంది  అనుకోవడంలో ఎటువంటి  సందేహమూ లేదు. తెలుగు భాష తేనె వలె మధురంగా ఉంటుంది. “సంస్కృతంలోని చక్కెర పాకం, అరవభాష లోని అమృతరాశి, కన్నడ భాష లోని తేట,ఇవన్నీ తెలుగు నందు కలవు” అని శ్రీకృష్ణదేవరాయల వారు తెలిపారు. తెలుగు భాష ద్రావిడ భాష నుండి వచ్చింది. ద్రావిడ భాషలు మొత్తం 21 అని ఒకానొక సందర్భంలో తెలిసింది. అందులో మన తెలుగు కూడా ఒకటి. తెలుగు లిపి కన్నడ లిపితో పోలియుండును. మనదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష మాట్లాడతారు.

    500-600 సంవత్సరాల క్రితం శాతహవాహనుల పరిపాలన కాలంలో “ప్రకృత్” అనే భాష మన ఆంధ్రప్రదేశ్ లో వాడటం జరిగింది. కానీ ఆ ప్రకృత్ భాషలోని తద్బావాలను కలిపి తెలుగుగా మార్చడం జరిగింది. ప్రకృత్  భాష కనుమరుగైంది,కానీ మన తెలుగు మాత్రం తేనెలా ఊరిస్తూనే ఉంది. మన తెలుగు భాషకి “తెనుగు భాష”, ఆంధ్రభాష  అను పర్యాయ పదాలు కలవు. తెలుగు భాషలోని అక్షరాలు 56 ఉండేవి. 18 అచ్చులు మరియు 38 హల్లులు ఉండేవి. కానీ, ఇప్పటి పాఠ్యప్రణాళిక ప్రకారం 16 అచ్చులు,36 హల్లులు గా మారిపోయినవి.

    తెలుగు భాష సంస్కృతం నుండి తీసుకొన బడింది. కానీ, లిపి వరకు వస్తే సంస్కృత భాష “దేవనాగిరి”లిపి లో ఉండును. తెలుగు బ్రహ్మ లిపిలో ఉండును. విజయనగర సామ్రాజ్య పరిపాలన నుండి తెలుగు యొక్క ప్రాదాన్యతపెరిగెను. రాయలవారి పాలనలో అష్టదిగ్గజాలు ఉండేవారు. వారందరూ తెలుగు భాషలో పండితోత్తములు.

    తెలుగు వ్యాకరణ  దిశగా చూసినా, పలికే విధానం దిశగా చూసిన ,ఎటు చూసిన తెలుగు భాష కి తెలుగే సాటి,వేరేదిలేదు దీనికి పోటీ. ఒక్క తెలుగు  భాషలో మాత్రమే “అష్టావదానం”, “శతావదనం”  “సహస్రావదనం” “సమస్యాపూర్ణం” అనే అంశాలు ఉండును. వేరే ఏ  భాషకు కూడా ఈ విధమైనా సౌకర్యం వీలుపడదు.తెలుగు భాష  గురించి ఎంత చెప్పినా, వ్రాసినా, చదివినా, విన్నా తనవి తీరదు. అంతటి మధురమైనది మన తెలుగు భాష. దక్షిణ భారతదేశం మరియూ ఇతర (తెలుగువారు) ప్రదేశాల్లోతెలుగు వారు, తెలుగుమాట్లాడేవారి సంఖ్య 66 మిలియన్లు అంటే ఆశ్చర్యపోనక్కరలేదు. ఇంకా ఎంత చెప్పినా తెలుగు భాషయొక్క ప్రాముఖ్యత ముందు దిగదుడుపే.

    ఇలాంటి  తెలుగు భాషని మనలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు.కొందరు తెలుగు మాట్లాడడానికే అసహ్యించుకుంటున్నారు. మరికొందరు తెలుగు మాట్లాడేవారిని దగ్గరకు కూడా రానివ్వరు. ప్రాశ్చ్యత్య దేశ భాషల, ఇతర భాషల యొక్క ప్రాముఖ్యతను పెంచుతున్నారే తప్ప తెలగుభాష కనీస గౌరవం కూడా ఇవ్వరు. తెలుగు వారమంతా ఎంతో వీలుగా, సౌకర్యంగా  ఉండే తెలుగుని మాట్లాడటమే మానేసారు.

    ఇకపోతే ఇప్పటి కాలం పిల్లలు, వారి సంగతి అసలు చెప్పనే వద్దు, తెలుగు పదాలే మర్చిపోతున్నారు. తెలుగు భాష యొక్క గొప్పతనం, తెలుగు జాతి తీయదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం అని ఒక కవి చాలా గొప్పగా చెప్పారు. పిల్లలు తెలుగులో మాట్లాడకుండా ఉండటానికి చాలా కారణాలు ఉండవచ్చు, వారు పెరుగుతున్న వాతావరణం, తల్లిదండ్రులు, పాఠశాలలు, స్నేహితులు మొదలైనవి. మొదటి పదమైన “అమ్మ” అనే పదానికి బదులు మమ్మీ, మామ్ అని అక్కడ నుంచి ప్రతి పదం, ప్రతీ సందర్బం,ప్రతీచోట కూడా పిల్లలు తెలుగుకి బదులుగా ఇతర భాషలపై మోజూ చూపుతారు. పిల్లలే కాదు, పెద్దవారు కూడా తెలుగులో మాట్లాడితే అదేదో తప్పని లేదా చుట్టు ప్రక్కలవాళ్లు మనకు నాగరికత అనేది తెలీయదని అనుకుంటారని వారు కూడా ఇతర భాషలలొ మాటాడటం మొదలు పెడతారు. ఇది చూసిన పిల్లలు ఇదే పద్దతిని పాటిస్తారు, కానీ అది తప్పు.ఎవరి మాతృభాష లో వారు మాట్లాడటం వారి హక్కు.అలా అని అభివృద్ది చెందకూడదని కాదు.(నాగరికత విషయంలో).పరభాషా జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో తప్పు లేదు.కానీ సంబోధనా సమయంలోనైనా మన భాషని మనం మరచిపోరాదు.

    ప్రాశ్చ్యత్య దేశాలు సైతం మన  భాషను, మన భాషలోని కమ్మదనాన్ని మెచ్చుకొని ఆదరిస్తున్నపుడు మనం మన తెలుగు భాషని అగౌర్వించడం బావ్యం కాదు. దయచేసి తెలుగువారందరము తెలుగులోనే మాట్లాడుదాము. పాఠశాలలో కూడా తెలుగు భాషను /తెలుగు భాషలోని గొప్పదనాన్ని పాఠ్యాంశాల రూపంలో ప్రచురించినచో విద్యార్ధిని, విద్యార్థులకు బాల్యములోనే తెలుగు భాషయొక్క ప్రాముఖ్యతను గురించి అవగాహన ఏర్పడును.

    కె. ఐశ్వర్య,
    6వ తరగతి, సాధు వశ్వని ఇంటర్నేషనల్ స్కూల్,
    కొంపల్లి, జయభేరి పార్క్, హైదరాబాద్

  • తెలుగు బాష ప్రాముఖ్యత (తృతీయ బహుమతి పొందిన వ్యాసం)

    తెలుగు బాష ప్రాముఖ్యత 

     “దేశ  భాషలందు తెలుగు లెస్స” అని శ్రీకృష్ణదేవరాయలు వారు అన్న మాటకు అర్థం మన దేశంలో ఎన్నిభాషలున్నా సరే ఏ భాష కూడా తెలుగుతో పోటీ పడలేదు అని. తెలుగు భాషలోని మాధుర్యం అంతా ఇంతా కాదు. ఉగ్గు పాల నుండి ఒక బిడ్డకి తల్లి పాట పాడేందుకు వీలైన భాష.తెలుగు భాషలోని స్పష్టత, నేర్పు, భావం, కూర్పు చాలా అందంగా ఉంటాయి. ఎందరో మహనీయులు, కవులు, కవయిత్రులు మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను గురించి చాటిచెప్పారు.

     

    అందులో ప్రప్రధమంగా  నన్నయ, తిక్కన, యెఱ్ఱాప్రగడలు మహాభారతం వంటి గొప్పకావ్యాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి, సామాన్య మనవుడికి అర్థమయ్యే విధంగా, చక్కగా అనువదించారు.ఆ కవిత్రయానికి జోహార్లు. వీరేకాక, గురజాడ అప్పారావు, వీరేశలింగం పంతులు, శ్రీశ్రీ, సి.నా.రె మొదలైన కవుల వరకు అందరూ ఎన్నో గొప్ప తెలుగు కావ్యాలు, కథలు రచించారు.

    తెలుగులో కవిత్వం మన ఆది కవి “నన్నయ” గారి మహాభారతం నుండి అంటే 11వ శతాబ్దం నుండి మొదలైంది  అనుకోవడంలో ఎటువంటి  సందేహమూ లేదు. తెలుగు భాష తేనె వలె మధురంగా ఉంటుంది. “సంస్కృతంలోని చక్కెర పాకం, అరవభాష లోని అమృతరాశి, కన్నడ భాష లోని తేట,ఇవన్నీ తెలుగు నందు కలవు” అని శ్రీకృష్ణదేవరాయల వారు తెలిపారు. తెలుగు భాష ద్రావిడ భాష నుండి వచ్చింది. ద్రావిడ భాషలు మొత్తం 21 అని ఒకానొక సందర్భంలో తెలిసింది. అందులో మన తెలుగు కూడా ఒకటి. తెలుగు లిపి కన్నడ లిపితో పోలియుండును. మనదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో భాష మాట్లాడతారు.

    500-600 సంవత్సరాల క్రితం శాతహవాహనుల పరిపాలన కాలంలో “ప్రకృత్” అనే భాష మన ఆంధ్రప్రదేశ్ లో వాడటం జరిగింది. కానీ ఆ ప్రకృత్ భాషలోని తద్బావాలను కలిపి తెలుగుగా మార్చడం జరిగింది. ప్రకృత్  భాష కనుమరుగైంది,కానీ మన తెలుగు మాత్రం తేనెలా ఊరిస్తూనే ఉంది. మన తెలుగు భాషకి “తెనుగు భాష”, ఆంధ్రభాష  అను పర్యాయ పదాలు కలవు. తెలుగు భాషలోని అక్షరాలు 56 ఉండేవి. 18 అచ్చులు మరియు 38 హల్లులు ఉండేవి. కానీ, ఇప్పటి పాఠ్యప్రణాళిక ప్రకారం 16 అచ్చులు,36 హల్లులు గా మారిపోయినవి.

    తెలుగు భాష సంస్కృతం నుండి తీసుకొన బడింది. కానీ, లిపి వరకు వస్తే సంస్కృత భాష “దేవనాగిరి”లిపి లో ఉండును. తెలుగు బ్రహ్మ లిపిలో ఉండును. విజయనగర సామ్రాజ్య పరిపాలన నుండి తెలుగు యొక్క ప్రాదాన్యతపెరిగెను. రాయలవారి పాలనలో అష్టదిగ్గజాలు ఉండేవారు. వారందరూ తెలుగు భాషలో పండితోత్తములు.

    తెలుగు వ్యాకరణ  దిశగా చూసినా, పలికే విధానం దిశగా చూసిన ,ఎటు చూసిన తెలుగు భాష కి తెలుగే సాటి,వేరేదిలేదు దీనికి పోటీ. ఒక్క తెలుగు  భాషలో మాత్రమే “అష్టావదానం”, “శతావదనం”  “సహస్రావదనం” “సమస్యాపూర్ణం” అనే అంశాలు ఉండును. వేరే ఏ  భాషకు కూడా ఈ విధమైనా సౌకర్యం వీలుపడదు.తెలుగు భాష  గురించి ఎంత చెప్పినా, వ్రాసినా, చదివినా, విన్నా తనవి తీరదు. అంతటి మధురమైనది మన తెలుగు భాష. దక్షిణ భారతదేశం మరియూ ఇతర (తెలుగువారు) ప్రదేశాల్లోతెలుగు వారు, తెలుగుమాట్లాడేవారి సంఖ్య 66 మిలియన్లు అంటే ఆశ్చర్యపోనక్కరలేదు. ఇంకా ఎంత చెప్పినా తెలుగు భాషయొక్క ప్రాముఖ్యత ముందు దిగదుడుపే.

    ఇలాంటి  తెలుగు భాషని మనలో చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు.కొందరు తెలుగు మాట్లాడడానికే అసహ్యించుకుంటున్నారు. మరికొందరు తెలుగు మాట్లాడేవారిని దగ్గరకు కూడా రానివ్వరు. ప్రాశ్చ్యత్య దేశ భాషల, ఇతర భాషల యొక్క ప్రాముఖ్యతను పెంచుతున్నారే తప్ప తెలగుభాష కనీస గౌరవం కూడా ఇవ్వరు. తెలుగు వారమంతా ఎంతో వీలుగా, సౌకర్యంగా  ఉండే తెలుగుని మాట్లాడటమే మానేసారు.

    ఇకపోతే ఇప్పటి కాలం పిల్లలు, వారి సంగతి అసలు చెప్పనే వద్దు, తెలుగు పదాలే మర్చిపోతున్నారు. తెలుగు భాష యొక్క గొప్పతనం, తెలుగు జాతి తీయదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం అని ఒక కవి చాలా గొప్పగా చెప్పారు. పిల్లలు తెలుగులో మాట్లాడకుండా ఉండటానికి చాలా కారణాలు ఉండవచ్చు, వారు పెరుగుతున్న వాతావరణం, తల్లిదండ్రులు, పాఠశాలలు, స్నేహితులు మొదలైనవి. మొదటి పదమైన “అమ్మ” అనే పదానికి బదులు మమ్మీ, మామ్ అని అక్కడ నుంచి ప్రతి పదం, ప్రతీ సందర్బం,ప్రతీచోట కూడా పిల్లలు తెలుగుకి బదులుగా ఇతర భాషలపై మోజూ చూపుతారు. పిల్లలే కాదు, పెద్దవారు కూడా తెలుగులో మాట్లాడితే అదేదో తప్పని లేదా చుట్టు ప్రక్కలవాళ్లు మనకు నాగరికత అనేది తెలీయదని అనుకుంటారని వారు కూడా ఇతర భాషలలొ మాటాడటం మొదలు పెడతారు. ఇది చూసిన పిల్లలు ఇదే పద్దతిని పాటిస్తారు, కానీ అది తప్పు.ఎవరి మాతృభాష లో వారు మాట్లాడటం వారి హక్కు.అలా అని అభివృద్ది చెందకూడదని కాదు.(నాగరికత విషయంలో).పరభాషా జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో తప్పు లేదు.కానీ సంబోధనా సమయంలోనైనా మన భాషని మనం మరచిపోరాదు.

    ప్రాశ్చ్యత్య దేశాలు సైతం మన  భాషను, మన భాషలోని కమ్మదనాన్ని మెచ్చుకొని ఆదరిస్తున్నపుడు మనం మన తెలుగు భాషని అగౌర్వించడం బావ్యం కాదు. దయచేసి తెలుగువారందరము తెలుగులోనే మాట్లాడుదాము. పాఠశాలలో కూడా తెలుగు భాషను /తెలుగు భాషలోని గొప్పదనాన్ని పాఠ్యాంశాల రూపంలో ప్రచురించినచో విద్యార్ధిని, విద్యార్థులకు బాల్యములోనే తెలుగు భాషయొక్క ప్రాముఖ్యతను గురించి అవగాహన ఏర్పడును.

    కె. ఐశ్వర్య,
    6వ తరగతి, సాధు వశ్వని ఇంటర్నేషనల్ స్కూల్,
    కొంపల్లి, జయభేరి పార్క్, హైదరాబాద్

  • గిడుగు రామమూర్తి పంతులు గారు

    గిడుగు రామమూర్తి పంతులు గారు

    గిడుగు రామమూర్తి పంతులు గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినమైన ఆగస్టు 29 ను  తెలుగు భాషా దినోత్సవము’గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పరిగణిస్తున్నది. గిడుగు గారు తెలుగు వ్యావహారిక బాషకు పితామహుడిగా పరిగణించబడతారు. గిడుగు రామమూర్తి గారికి అభినవ వాగమశాసనుడు అని బిరుదు.

    గిడుగు వెంకట రామమూర్తి (1863-1940):

    తెలుగు ప్రజలు స్మరించదగ్గ ప్రథమ స్మరణీయుడు గిడుగు రామమూర్తి. ఆధునిక విజ్ఞాన వ్యాప్తికి, వచనరచనకు కావ్యభాష పనికిరాదనీ, సామాన్యజనానికి అర్థమయ్యే సమకాలీన “శిష్టవ్యావహారికం”లో ఉండాలనీ ఆనాటి సాంప్రదాయికపండితులతో హోరాహోరీగా యుద్ధంచేసి ఆధునికప్రమాణభాషను ప్రతిష్టించటానికి మార్గదర్శకుడైనవాడు గిడుగు రామమూర్తి.

    గిడుగువారి వ్యవహారిక భాషోద్యమం వల్ల ఆధునిక సాహిత్యం కొత్త సొగసులు సంతరించుకుంది. రచనావైవిధ్యం, వైశిష్ట్యంతో పుష్టిచేకూరింది. విశ్వవిద్యాలయాలలో వాడుకభాష రాజ్యమేలుతోంది. పత్రికలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. అక్షరాస్యత పెరిగింది. తెలుగు అధికారభాషగా, పరిపాలనా భాషగా కీర్తికెక్కింది. దీనికంతటికీ గిడుగు పిడుగే మూలకారకుడు.

    గిడుగు రామమూర్తి గారి గురించి ఇంకా చెప్పాలంటే

    • గ్రాంధికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు.
    • ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు.
    • బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది.
    • శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్దితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు.
    • గిడుగు ఉద్యమంవల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది.
    • తెలుగు భాష గురించి ఆధునిక పద్ధతిలో ఆలోచించిన తొలి భాషా విజ్ఞాని గిడుగు రామమూర్తి గారు.

    ఈ వాడుకభాషా వాదాన్ని చేపట్టినందుకు గిడుగువారు పండితులతో యుద్ధం చేయవలసివచ్చింది. దీన్ని గ్రామ్యవాదమనీ, గిడుగువారు గ్రామాచార్యులనీ గ్రాంధికవాదులు హేళన చేస్తూ పద్యాలూ, వ్యాసాలు రాశారు. జయంతి రామయ్యపంతులు, కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి, వేదం వెంకటరామశాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి మొదలైన వాళ్ళతో ఢీకొనవలసి వచ్చింది. ఆంధ్రసాహిత్య పరిషత్తు గ్రాంధిక భాషావాదానికి అండగ నిలిచింది. గిడుగువారు ‘తెలుగు’ పత్రిక ద్వారా గ్రాంధిక వాదాన్ని ఖండిస్తూ వ్యావహారిక వాదాన్ని బలపరిచారు. పండితులే తప్పులు లేకుండా రాయలేని గ్రాంధికం బలవంతాన రుద్దడం ఎందుకంటూ “ఆంధ్రపండిత బిషక్కుల భాషాభేషజం” అనే పుస్తకం ప్రచురించారు.

    ఆయన సాధించిన మహత్కార్యం ఏమిటి?

    • తెలుగు సాహిత్యంపై పండితుల గుత్త్ధాకారాన్ని పోగొట్టాడు.
    •  ప్రజలలో ఒక్కరు కూడా నిరక్షరాస్యులు కాకూడదని, అందుకు వాడుక భాష సాధనం కాని గ్రాంధికమని తమకే రాని, తమకే తెలియని, భాషను పిల్లలు ఉపయోగించాలనీ అందులోనే పుస్తకాలు రాయాలనీ, దానిలోనే పాఠ్యపుస్తకాలుండాలని శాసించడం అవివేకమని ఉద్యమించారు.
    • చెళ్లపిళ్ల వెంకటశాస్ర్తీ, తాతా సుబ్బరాయుడు శాస్ర్తీ వంటి ఉద్దండ పండితులే ఆయన వాదంలోని సబబు గుర్తించారు. బలపరచారు.
    • కుండలాల, శాలువాల పండితుల సాహిత్యాధికారం, అదన్నీ అసంబద్ధమైన వ్యాకరణ, ఛందశ్శాస్త్ర దండనాధికారం చెల్లదన్నాడు.
    • సాహిత్య ప్యూడల్ సంప్రదాయాన్ని ధిక్కరించి, నిరాకరించి నిర్మూలించి ప్రజాస్వామ్య పద్ధతిని తెలుగు సాహిత్యంలో ప్రతిష్ఠించాడు.
    • రచయిత ఏదైనా రాసినప్పుడు, లోకాన్ని ఉద్దేశించినప్పుడు అది అంటే ఆ పదం ఇదివరలోనే వినిమయంలో ఉన్నప్పుడుదా? తప్పు ఒప్పులు నిర్ణయించే అధికారం ఎవరికీ లేదన్నాడాయన.
    • భాషకైనా, మనిషికైనా మార్పు కూర్పు చేర్పు సహజమని బోధించాడు, నచ్చచెప్పాడు.

    వ్యావహారిక భాషోద్యమం

    తెలుగు భాషలో వచ్చిన చారిత్రాత్మకమైన మార్పుకు ప్రధాన కారణం గిడుగు రామమూర్తి గారి సారధ్యంలో నడిచిన వ్యావహారిక భాష ఉద్యమం లేదా వ్యావహారిక భాషోద్యమం. ఇది 20వ శతాబ్దపు పూర్వార్ధంలో ప్రాచీనమైన గ్రాంథిక భాషకు మరియు వ్యావహారిక లేదా వాడుక భాషకు మధ్య జరిగిన భాషా ఉద్యమం.

    పూర్వం తెలుగులో పాఠ్యాంశాలు అన్నీ గ్రాంధిక బాషలోనే ఉండేవి. 1907లో ఉత్తర కోస్తా జిల్లాలకు పాఠశాలాల ఇన్స్పెక్టర్‌గా  వచ్చిన జె.ఎ.యేట్స్ (J. A. Yates) అనే  బ్రిటీష్ అదికారి ప్రజలు వ్యవహరించే భాష, పుస్తకాల భాష మధ్య ఉన్న  తేడాలు చూసి ఆవేధన చెందారు. ఆయన అదే విషయాన్ని గిడుగు వారితో చర్చించారు. ఆ విధంగా గిడుగు జీవిత ఉత్తరార్థంలో ఈ విషయాన్ని గురించి గాఢంగా ఆలోచించి తెలుగు విద్యావిధానంలో అన్యాయం జరుగుతున్నదని గుర్తించాడు. గురజాడ, గిడుగులు, శ్రీనివాస అయ్యంగారు, యేట్సు — ఈ నలుగురి ఆలోచనల వల్ల వ్యావహారిక భాషోద్యమం ఆరంభమైంది.

    1919-20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు ‘తెలుగు’ అనే మాసపత్రిక నడిపాడు. వ్యవహారిక భాషను ప్రతిఘటించిన ఆంధ్ర సాహిత్య పరిషత్తు సభలో (1925, తణుకులో) నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేసాడు “గిడుగు”. సాహితీ సమితి, నవ్యసాహిత్య పరిషత్తు మొదలైన సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరచాయి.

    స్కూలు కాలేజీ పుస్తకాల్లో గ్రాంథికభాషే పాతుకుపోయింది; కొన్నిటిలో వీరేశలింగంగారు ప్రతిపాదించిన సరళ గ్రాంథికం కూడా వచ్చింది. గిడుగు రామమూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించాడు.

    1919లో గిడుగు “తెలుగు” అనే మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాస పాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించాడు. కాని ఆ పత్రిక ఒక ఏడాది మాత్రమే నడిచింది. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి, కందుకూరి వీరేశలింగం, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రి మొదలైన కవులు, పండితులు వ్యావహారిక భాషావాదం వైపు మొగ్గు చూపారు. 1919 ఫిబ్రవరి 28న రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం అధ్యక్షులుగా, గిడుగు కార్యదర్శిగా “వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం” స్థాపించారు.

    1924లో కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్తు ఆధికారికంగా వ్యావహారిక భాషా నిషేధాన్ని ఎత్తివేసింది.

    1933లో గిడుగు రామమూర్తి సప్తతి మహోత్సవం ఆయన అభిమానులు, శిష్యులు రాజమహేంద్రవరంలో బ్రహ్మాండంగా జరిపారు. తెలికచెర్ల వెంకటరత్నం సంపాదకుడుగా ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 46 పరిశోధక వ్యాసాలతో “Miscellany of Essays” (వ్యాస సంగ్రహం) అనే ఉద్గ్రంథాన్ని ఆయనకు సమర్పించారు.

    1936లో నవ్యసాహిత్య పరిషత్తు అనే సంస్థను ఆధునికులు స్థాపించి సృజనాత్మక రచనల్లో శిష్టవ్యావహారికాన్ని ప్రోత్సహించే “ప్రతిభ” అనే సాహిత్యపత్రికను ప్రచురించారు.

    1937లో తాపీ ధర్మారావు సంపాదకులుగా “జనవాణి” అనే పత్రిక కేవలం ఆధునిక ప్రమాణ భాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయటం మొదలుపెట్టింది.

    గ్రాంథిక భాషావాదుల అభిప్రాయాలు

    • అనాగరిక భాష వంటి వాడుక భాష ఉత్తమమైన సాహిత్య రచనకి పనికిరాదు.
    • వాడుక భాష మాట్లాడడం వరకే పరిమితం అది గ్రామ్యభాష.
    • వాడుక భాష ఒక లక్షణం గానీ, వ్యవస్థ గానీ లేనిది.
    • వ్యావహారిక భాషావ్యాప్తి వలన ప్రాచీనమైన కావ్యాలకు, వ్యాకరణాలకు నష్టం కలుగుతుంది. మన సాహిత్య సంపద అనాథ అవుతుంది.
    • వాడుక భాషలో అనేక భేదాలున్నాయి. మాండలికాలు ఉన్నాయి. ఒక మాండలిక భాష వేరొక ప్రాంతం వారికి అర్థం కాదు. పాఠ్యగ్రంథాలు, సాహిత్యం ఏ మాండలికంలో రాయాలి ? ఇవరికి ఇష్టమైన భాషలో వారు రాసుకుంటే తెలుగు భాషా సమైక్యతకి ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి తెలుగు భాషను పరిరక్షించడానికి గ్రాంథిక భాషే మంచిది.
    • నన్నయ నుండి నేటి వరకు గ్రాంథిక భాష మారలేదు. దానికి ఏకరూపత, ప్రామాణికత ఉన్నాయి.
    • వ్యాకరణ బద్ధం కాని ప్రామాణికత లేని వాడుక భాషలో సార్వకాలిక సాహిత్యరచన వీలుకాదు.
    • శాస్త్ర గ్రంథాలను అవసరమైతే సరళ గ్రాంథికంలో రచించవచ్చును.

    వ్యావహారిక భాషావాదుల అభిప్రాయాలు

    • వాడుక భాష గ్రామ్యభాష కాదు. సజీవ భాష.
    • వ్యావహారిక భాషకు లక్షణాలు, వ్యాకరణం లేవన్నారు. గ్రాంథిక భాషకి కూడా పూర్తిగా వ్యాకరణాలు లేదు.
    • తెలుగు భాష మారుతోంది. కాబట్టి కొత వ్యాకరణాలు, సవరణలు వెలువడ్డాయి. నన్నయ భాషకి, తిక్కన భాషకి, ప్రబంధ బాషకి, దక్షిణాంధ్ర యుగం నాటి భాషకి చాలా భేదాలున్నాయి.
    • వ్యావహారిక భాషావాదం ప్రాచీన సాహిత్యానికి వ్యతిరేకంగా ఏర్పడలేదు. ప్రాచీన కావ్యాలను, వ్యాకరణాలను గౌరవిస్తూనే వాడుక భాషకి ప్రాచుర్యం కల్పించాలి.
    • వాడుక భాషలో కూడా ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించవచ్చును. ఉదాహరణ: గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం.
    • గ్రాంథికభాష పండితులకే అర్థం కాదు. గొప్ప పండితులు కూడా తప్పులు లేకుండా రాయలేరు. మరి ఇతరులు ఎలా రాయగలరు.
    • వాడుక భాషలో భేదాలున్నాయి. అయితే అందరూ కలిసి కోస్తా మాండాలికాన్నే వాడుతున్నారు. కాబట్టి కోస్తా మాండలిక ఆంధ్రమే అనుసంధాన భాషగా ఉంటుంది.
    • మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర, సాంకేతిక రంగాలలో విజ్ఞానం పెంపొందించుకోవాలంటే పాఠ్యగ్రంథాలు వాడుక భాషలోనే ఉండాలి.
    • వాడుక భాష ప్రజల భాష. గ్రాంథిక భాష పండితుల భాష.

    సవర భాష పాండిత్యం

    నాగరికతకు దూరంగా కొండల్లో జీవిస్తున్న ఆదిమ ప్రవర్తులైన సవరుల కోసం జీవితాన్ని త్యాగం చేశారు. తమ కాలాన్ని, ధనాన్ని వినియోగించారు.

    ఆరోజుల్లోనే అతనికి దగ్గర అడవుల్లో ఉండే సవరల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు, సవరభాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నాడు. ఈ పరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది. సవరభాషలో పుస్తకాలు రాసి సొంతడబ్బుతో స్కూళ్ళు పెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళ భాషలోనే చదువు చెప్పే ఏర్పాట్లు చేశాడు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913లో “రావ్‌ బహదూర్‌” బిరుదు ఇచ్చారు. భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణ నిర్మాణ విధానం నేర్చుకొన్నారు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 1936లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించారు.

    మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవరభాషా వ్యాకరణాన్ని 1931లోను, సవర-ఇంగ్లీషు కోశాన్ని 1938లోను అచ్చువేశారు. 1934లో ప్రభుత్వం అతనికి ‘కైజర్-ఇ-హింద్ ‘ అనే స్వర్ణ పతకాన్నిచ్చి గౌరవించింది.

    “సవర” దక్షిణ ముండా భాష. మనదేశంలో మొట్టమొదట ముండా ఉపకుటుంబ భాషను శాస్త్రీయంగా పరిశీలించినవాడు గిడుగు రామమూర్తి. ఆస్ట్రో-ఏషియాటిక్‌ భాషా కుటుంబంలో ఒక శాఖ ముండాభాషలు. ఆర్యభాషా వ్యవహర్తలు మన దేశానికి రాకముందు (క్రీ.పూ. 15వ శతాబ్ది) నుంచి వీళ్ళు మనదేశంలో స్థిరపడ్డారు. వీరిని “శబరు”లనే ఆదిమజాతిగా ఐతరేయ బ్రాహ్మణం (క్రీ.పూ. 7వ శతాబ్ది) లో పేర్కొన్నారు.

    శాసనాల అధ్యయనం

    హైస్కూల్లో చరిత్రపాఠం చెప్పేరోజుల్లోనే దగ్గరలో ఉన్న ముఖలింగ దేవాలయాల్లో ఉన్న శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకుని చదివాడు. విషయపరిశోధన చేసి వాటి ఆధారంగా ఎన్నో చారిత్రకాంశాలు, ముఖ్యంగా గాంగవంశీయులను గురించి రామమూర్తి ఇంగ్లీషులో ప్రామాణికవ్యాసాలు రాసి Indian Antiquary లోనూ Madras Literature and Science Society Journal లోనూ ప్రచురించాడు. 1911లో గిడుగు 30 ఏళ్ళ సర్వీసు పూర్తికాగానే అధ్యాపకపదవి నుంచి స్వచ్ఛందంగా రిటైరయ్యాడు. అంతకుముందు కొద్ది సంవత్సరాల ముందే ఆధునికాంధ్రభాషాసంస్కరణ వైపు అతని దృష్టి మళ్ళింది.

    తుదివిన్నపం

    గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికాసంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుదివిన్నపంలో వ్యావహారిక భాషా వ్యాప్తికి చాలా సంతృప్తి పొందాడు. కాని, ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టక పోవటానికి బాధపడ్డాడు. ఆ విన్నపంలోని చివరిమాటలు –

    “దేశభాష ద్వారా విద్య బోధిస్తే కాని ప్రయోజనం లేదు. శిష్టజనవ్యావహారికభాష లోకంలో సదా వినబడుతూంటుంది. అది జీవంతో కలకలలాడుతూ ఉంటుంది. గ్రాంథికభాష గ్రంథాలలో కనబడేదే కాని వినబడేది కాదు. ప్రతిమ వంటిది. ప్రసంగాలలో గ్రాంథికభాష ప్రయోగిస్తూ తిట్టుకొన్నా సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి. గ్రాంథికభాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీనకావ్యాలు చదువవద్దనీ విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని ఆ భాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను. నిర్దుష్టంగా ఎవరున్ను వ్రాయలేరు. వ్రాసినా వ్రాసేవారికి కష్టమే వినేవారికి కష్టమే. వ్రాసేవాండ్లేమి చేస్తున్నారు? భావం తమ సొంత (వాడుక) భాషలో రచించుకొని గ్రాంథికీకరణం చేస్తున్నారు. అది చదివేవాండ్లు వినేవాండ్లు తమ సొంత వాడుకమాటలలోకి మార్చుకొని అర్థం చేసుకొంటున్నారు.

    ఎందుకీ వృథాప్రయాస? స్వరాజ్యం కావలెనంటున్నాము. ప్రత్యేకాంధ్రరాష్ట్రము కోసం చిక్కుపడుతున్నాము. ప్రజాస్వామిక పరిపాలనం కోరుచున్నాము. ఇటువంటి పరిస్థితులలో మన ప్రజలకు, సామాన్య జనులకు ఏభాష ద్వారా జ్ఞానం కలుగచేయవలసి ఉంటుందో, ఏ భాషలో గ్రంథరచన సాగించవలసి ఉంటుందో ఆలోచించండి. మీచేతులలో పత్రికలున్నవి. పత్రికల ద్వారా మీరు ఎంతైనా చేయగలరు”.

     

    గిడుగు రామమూర్తి పంతులు గారి జన్మదినమైన ఆగస్టు 29 ను  ‘తెలుగు భాషా దినోత్సవము’గా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పరిగణిస్తున్నది. గిడుగు గారు తెలుగు వ్యావహారిక బాషకు పితామహుడిగా పరిగణించబడతారు. గిడుగు రామమూర్తి గారికి అభినవ వాగమశాసనుడు అని బిరుదు. తెలుగుబాషకు  ఎనలేని సేవ చేసిన గిడుగు గారు 1940, జనవరి 22న  కన్ను మూశారు