Tag: ఆంద్రప్రదేశ్

  • మన తెలుగు గురించి మీకు తెలుసా ??

    • 12వ శతాబ్ధిలో పాల్కురికి సోమనాధుడు "నవలక్ష తెలుంగు" – అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము – అని వర్ణించాడు.
    • అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష.
    • పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాలనాటిది
    • క్రీ.పూ.700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము)లో మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది.
    • క్రీ.పూ. 4వ శతాబ్ధిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించినాడు.
    • బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉన్నది.
    • ప్రపంచవ్యాప్తంగా 10కోట్ల మందికి పైగా ఈ భాషను మాట్లాడతారు.
    • కర్ణాటక సంగీతం లోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నవి
    • తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు.

    • తెలుగుకి సంస్కృతం మాతృమూర్తి అనిపిస్తుంది. ఎందుకనగా ఉచ్చారణ, భావం సంస్కృతం ను తలపిస్తాయి.
    • భారతదేశంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ప్రముఖ జన్యు (జెనెటిక్) శాస్త్రవేత్త అయిన జె.బి.ఎస్.హాల్డేన్ గారు ఓ సందర్భములో తెలుగు భారత దేశానికి జాతీయ భాష కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పారు.
    • క్రీస్తు శకం మొదటి శతాబ్దము లో శాతవాహన రాజులు సృష్టించిన "గాధాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి.
    • అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతము, తమిళముల తో బాటు తెలుగు భాషను అక్టోబరు 31, 2008న భారత ప్రభుత్వము చేర్చింది.
    • తెలుగులో, 16 అచ్చులు, 3 విశేషఅచ్చులు, 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు కలవు.
    • తెలుగు, భారత దేశం లోని ప్రాంతీయ భాషలలో మొదటి స్థానం లోను, ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో పదమూడవ స్థానములోనూ, భారత దేశములో జాతీయ భాషయిన హిందీ తర్వాత రెండవ స్థానములోను నిలుస్తుంది.
    • తెలుగు ఇతర భాషా పదాలను సులభంగా అంగీకరిస్తుంది
    • ప్రపంచంలోని అతి కొద్ది క్రమబద్ధీకరించబడిన భాషలలో తెలుగు ఒకటి.
    • తెలుగు వ్యాకరణము చాలా తేలికగానూ, నిర్మాణపరంగా అతి శుద్ధంగానూ ఉంటుంది.
    • త్యాగరాజు, భద్రాచల రామదాసు, క్షేత్రయ్య, అన్నమయ్య, వంటివారు తమ తమ కృతులతో, కీర్తన లతో, తెలుగును సంగీతపరంగా సుసంపన్నం చేసినారు
    • తెలుగు భాషలో ఒక ప్రముఖమైన విషయము ఏమిటంటే సంధి. రెండు పదాలు పక్కపక్కన చేర్చి పలికినప్పుడు మనకు క్రొత్త మూడవ పదము వస్తుంది.
    • తెలుగు భాష మూలపురుషులు యానాదులు.
    • తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు
    • తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దమునకు చెందినది.
    • చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.
    • 10 వ శతాబ్దపు పారశీక చరిత్రకారుడు అల్ బిరుని తెలుగు భాషను 'ఆంధ్రీ' యని వర్ణించెను.
    • 11వ శతాబ్దము ఆరంభమునుండి 'తెలుంగు భూపాలురు', 'తెల్గరమారి', 'తెలింగకులకాల', 'తెలుంగ నాడొళగణ మాధవికెఱియ' వంటి పదాలు శాసనాల్లో వాడబడ్డాయి.
    • 11వ శతాబ్దములో నన్నయ భట్టారకుని కాలమునాటికి తెలుగు రూపాంతరముగా "తెనుగు" అనే పదము వచ్చినది.
    • 13వ శతాబ్దములో మహమ్మదీయ చారిత్రికులు ఈ దేశమును "తిలింగ్" అని వ్యవహరించారు.
    • వ్యాకరణపరంగా, తెలుగులో కర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి.
    • అశోకుని కాలములో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాషనుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. అశోకుడి కాలానికి చెందిన బ్రాహ్మి లిపి రూపాంతరమైన భట్టిప్రోలు లిపి నుంచి తెలుగు లిపి ఉద్భవించింది.
    • తెలుగు భాష అక్షరాలకు యూనికోడ్ బ్లాకు 0C00-0C7F (3072-3199) ఇవ్వబడినది.
  • మన తెలుగుకు మళ్లీ వెలుగు

    మన తెలుగుకు మళ్లీ వెలుగు

     తల్లిపాల మాధుర్యాన్ని తలపించేదే అమ్మభాష. అలాంటి మన తెలుగు, నేడు ఆంగ్ల ప్రభావంవల్ల చిక్కిశల్యమైపోతోంది. తెలుగు భాషావికాసోద్యమం మళ్ళీ మొదలైతే తప్ప, పరిస్థితి చక్కబడదు. విజయవాడలో నిన్న ప్రారంభమైన ‘ప్రపంచ తెలుగు రచయితల రెండో మహాసభ’లో పాల్గొన్న వక్తల ప్రసంగాల సారాంశమిదే. సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ‘ఈనాడు’ సంపాదకులు రామోజీరావు- భాషోద్ధరణ పాఠశాలనుంచి మొదలుకావాలన్నారు. వాడుకే భాషకు వేడుక అవుతుందని స్పష్టంచేశారు. తెలుగు భాష పునరుజ్జీవానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆ కృషికి ‘తెలుగు రచయితల మహాసభ’ నాంది పలకాలన్నారు. రామోజీరావు ప్రసంగం పూర్తిపాఠమిది…

    మాతృభాష మీద మమకారంతో, ప్రేమతో మీరందరూ ఎంతో దూరాలనుంచి వచ్చారు. ఇది నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఇదొక బృహత్‌ యజ్ఞం. దీన్ని నిర్వహిస్తున్న కృష్ణాజిల్లా తెలుగు రచయితల సంఘాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అమ్మభాష గురించి మాట్లాడటం అంటే తల్లిపాల మాధుర్యాన్ని తనివితీరా మననం చేసుకోవడమే. తెలుగు గడ్డపై పుట్టడం ఎన్నో జన్మల తపోఫలమని కొందరు మహాత్ములన్నారు. అంతెందుకు- జాతీయభాష కాగల అర్హత తెలుగుకు మాత్రమే ఉందని జేబీ హేల్డెన్‌ లాంటి విదేశీయుడే మెచ్చుకున్నాడు.

    తెలుగు ఒక భాష మాత్రమే కాదు. ఒక సంస్కృతి… ఒక సంప్రదాయం… ఒక జీవన విధానం. ఆ మాటకొస్తే, ఏ జాతికైనా చైతన్యం కలిగించేది భాషే. ఒక జాతి ప్రజల కట్టుబాటును మతంకన్నా భాషే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. బంగ్లాదేశ్‌ అనుభవమే ఇందుకు ఉదాహరణ. భాషను, సంస్కృతిని నిలబెట్టుకుంటేనే తెలుగుజాతి కలకాలం వర్ధిల్లుతుంది. నిజానికి మన భాషకేం తక్కువ? దేశంలో హిందీ తరవాత ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగే. అయితే… ఆంగ్ల ప్రభావంవల్ల మన భాష చిక్కి శల్యమైపోతోంది.

    మన ఆలోచనల్లో, ఆచార వ్యవహారాల్లో తెలుగుదనం కరిగిపోతోంది… తరిగిపోతోంది. ఇందువల్ల మన సంస్కృతి, సంప్రదాయం, మానవ సంబంధాలు… అన్నీ దెబ్బతింటున్నాయి. రానురాను తెలుగుదనం ఉనికే పోతుందా అన్న భయం కలుగుతోంది. 30శాతం ప్రజలకు సొంత భాష చదవడం, రాయడం రాకపోతే ఆ భాష అంతరించిపోతుందని యునెస్కో చెప్పింది. ఈ కష్టం… ఈ నష్టం తెలుగుకు రాకూడదు. ఈ బాధ్యత మన భుజస్కంధాలమీద ఉంది. ఇందుకు ఎవరికి వాళ్లు ముందుకు రావాలి. మనరాష్ట్రంలో పిల్లల్ని గమనించండి… ఆంగ్లపదం రాకుండా ఒక్క నిమిషం కూడా తెలుగులో మాట్లాడలేరు. కారణాలేమైనా చక్కటి తెలుగు రాయడం, మాట్లాడటం, చదవటం అపురూపమైపోతోంది.

    వాడుక… భాషకు వేడుక

    ఏదైనా మాతృభాషలో నేర్చుకుంటేనే పిల్లలకు బాగా ఒంటపడుతుంది. అది తెలిసినా తల్లిదండ్రులు ఏమీ చేయలేకపోతున్నారు. అది వాళ్ల తప్పు కాదు. ఎవరికైనా పిల్లల భవిష్యత్తే ముఖ్యం కదా? పిల్లల చదువుసంధ్యలు, వాళ్ల భవిష్యత్తు ఒకపక్క- మాతృభాష అయిన తెలుగు భవిష్యత్తు ఒకపక్క. ఈ రెండూ ఒకదాంతో ఒకటి ముడివడి ఉన్నాయి.

    తెలుగు భాషమీద మొహంమొత్తి ఇంగ్లిషు వ్యామోహం పెరిగిందా అంటే, అదీ కాదు. ఏ భాషకైనా తప్పకుండా బహుముఖ ప్రయోజనం ఉండాలి. మొదటిది… చెప్పిన మాట ఎదుటివారికి స్పష్టంగా అర్థం కావాలి. ఇది సామాజిక ప్రయోజనం. భాష ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఉపయోగపడాలి. ఇది ఆర్థిక ప్రయోజనం. ఈ ప్రయోజనాలు నెరవేర్చినప్పుడే భాష రోజువారీ వ్యవహారంలో ఉంటుంది. భాషా సంస్కృతులు బాగున్న జాతి జీవకళతో ఉప్పొంగుతుంటుంది. ఇది ఎక్కడి విషయమో కాదు… మన ఇరుగు పొరుగును చూడండి. తమిళులు, కన్నడిగులు, మలయాళీలు, మరాఠీలు ఉన్నారు కదా!. భాషా సంస్కృతుల్ని ప్రాణంగా చూసుకుంటారు. వాటిని ఆత్మగౌరవ చిహ్నాలుగా చేసుకున్నారు. రేడియో, టీవీ, సెల్‌ఫోన్‌ వంటి ఇంగ్లిషు మాటల్ని కూడా వెంటనే తమిళ భాషలోకి అనువాదం చేసుకున్నారు. చివరికి డెంగీ, స్వైన్‌ ఫ్లూ లాంటి కొత్త వ్యాధులకూ తమిళ పేర్లున్నాయి. ఎక్కడో తప్ప ఆంగ్ల పదజాలానికి వారు దాసోహం కాలేదు. తమిళుల ధోరణి మిగతా భాషల వారందరికీ ఆదర్శం. ఒకటినుంచి పదో తరగతి దాకా ప్రతి విద్యార్థీ తమిళం నేర్చుకోవాలని అక్కడ నిబంధన పెట్టారు. తమిళంలో చదివినవారికే అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలిస్తారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమిళ భాషపై పరిశోధనలను బాగా ప్రోత్సహిస్తుంది. ఎప్పటికప్పుడు ఆంగ్ల పదాలకు తమిళ సమానార్థకాలను రూపొందించడంలో వాళ్లు తలమునకలవుతుంటారు.

    పొరుగు దేశాల సంగతి తీసుకుందాం… చైనా రెండు భాషల పద్ధతి పాటిస్తుంది. అందువల్ల ఆ దేశ ప్రజలు స్థానిక సంస్కృతిని, సంప్రదాయాన్ని, అస్తిత్వాన్నీ ఏ మాత్రం పోగొట్టుకోకుండానే అంతర్జాతీయ స్థాయిని అందుకుంటున్నారు. సమకాలీన పరిస్థితులనుబట్టి అక్కడి పాఠశాలల్లో బోధించే మాతృభాషను నిత్యనూతనంగా మలచుకుంటున్నారు. ఫ్రెంచ్‌ ప్రభుత్వమూ ఇలాంటి కృషే చేస్తోంది. మరి అలాంటి భాషాచైతన్యం, కట్టుబాట్లు మనకెందుకు లేవు? మనరాష్ట్రంలో అధికార భాష తెలుగు. ప్రభుత్వ ఉత్తర్వులు, ఉత్తరప్రత్యురాలు… అన్నీ తెలుగులో ఉండాలన్న నిబంధనలకు లోటు లేదు. అయితేనేం… రాజ్యమేలుతున్నది ఇంగ్లిషే!

    ఆంధ్రప్రదేశ్‌ అవతరణ సందర్భంగా మన తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చెప్పారు… ప్రతి రాష్ట్రానికి మాతృభాషే అధికార భాషగా ఉండాలని… పరిపాలన వ్యవహారాలన్నీ మాతృభాషలోనే జరగాలని. ఇప్పటికి అయిదున్నర దశాబ్దాలైంది. ఆంధ్రప్రదేశ్‌ ఆంగ్లప్రదేశ్‌ అయింది తప్ప- తెలుగు వాడకం పెరగలేదు. ఇతరులను చూసి నేర్చుకోవడం కూడా మనకు కరవైపోయింది. అమెరికా రాయబార కార్యాలయ సిబ్బంది రోజుకు ఎనిమిది గంటల చొప్పున, ఎనిమిది నెలలపాటు కష్టపడి తెలుగు నేర్చుకున్నారట. మరి మనమో? తెలుగులో మాట్లాడటం, రాయడం నామోషీ అనుకుంటున్నాం. భాషా ప్రేమికులైన ఒకరిద్దరు అధికారులో, న్యాయమూర్తులో తెలుగులో ఉత్తర్వులు జారీచేస్తే దాన్నే గొప్పగా చెప్పుకొంటున్నాం.

    ఇప్పటికైనా మించిపోయింది లేదు. తెలుగు భాషా వికాసోద్యమం మళ్లీ మొదలు కావాలి. ఇందుకు రెండు రకాల ప్రయత్నాలు సాగాలి. తెలుగువల్ల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ప్రయోజనాలుండేట్టుగా ప్రభుత్వ విధానాలు రూపుదిద్దుకోవాలి. తెలుగు వస్తేనే తమ బిడ్డలకు భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులకు నమ్మకం కలగాలి. అప్పుడే తమ పిల్లలు తెలుగు నేర్చుకోవడంమీద వాళ్లు సుముఖత చూపిస్తారు. సమాజం పెరిగేకొద్దీ భాష పెరుగుతుంది. విజ్ఞానం పెరిగేకొద్దీ భాష విస్తరిస్తుంది. ఈ క్రమంలో తెలుగు కూడా ఆంగ్లంతో పోటీపడి పెరగాలి. మనం వెనకబడితే భాష కూడా వెనకబడుతుంది. ఇంగ్లిషు మీద విముఖత అక్కర్లేదు. తెలుగు పట్ల సుముఖతను పెంచుకోవాలి.

    తెలుగులోనే మాట్లాడటం, చదవటం అంటే ఇంగ్లిషుకు వ్యతిరేకం కానే కాదు. ఇది అందరికీ స్పష్టం చెయ్యాలి. మనది అందరి భాష… ఎవరికీ అందని భాష కాకూడదు. ఇందుకు ప్రభుత్వం చెయ్యాల్సినవి కొన్ని… ప్రజలు చెయ్యాల్సినవి ఇంకొన్ని. భాషకు పట్టం కట్టడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఇందుకు సమాజంనుంచి ఒత్తిడి రావాలి. భాషోద్ధరణ పాఠశాలనుంచే మొదలు కావాలి. ఒకటో తరగతినుంచి పట్టభద్రస్థాయి దాకా తెలుగు భాషను తప్పనిసరి పాఠ్యాంశంగా చెయ్యాలి. ఇక్కడ మరో విషయం చెప్పాలి… పాఠ్యపుస్తకాల్లో ఉండే తెలుగు- పిల్లల్ని భయపెట్టేలా ఉండకూడదు. తేనెలొలికే తెలుగుమీద వాళ్లకు ఆసక్తి పెంచేట్టుగా ఉండాలి. ఇందుకోసం పాఠ్యపుస్తకాల్లోని పదజాలాన్ని ఇంకా సరళీకరించాలి. ఆంగ్ల పదాల వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి భాషాప్రియులు నడుం కట్టాలి.మన వ్యవహారంలోకి వచ్చిపడుతున్న ఆంగ్ల శబ్దాలకు ఎప్పటికప్పుడు తెలుగు మాటలను సృష్టించాలి. అయితే ఒక జాగ్రత్త తీసుకోవాలి. సమానార్థకాలు తయారు చేసేటప్పుడు అవి వినడానికి ఇంపుగా, తేలిగ్గా ఉండాలి. కొరుకుడు పడని పదాలైతే నష్టం వాటిల్లుతుంది.

    తెలుగు అనగానే ఏ తెలుగు అన్న మీమాంస అనవసరం. యాస భాషకు బలం. లక్షలమంది మాట్లాడే మాండలికాలన్నీ భాషకు ఆయువుపట్టులే. అవన్నీ అవసరమే. అసలు సిసలైంది జనభాషే. మంచి మంచి తెలుగు మాటలను ప్రసార సాధనాల్లోకి తెచ్చుకుంటే భాష అందగిస్తుంది. ఈ క్రతువులో పండితులే కాదు… భాష మీద ప్రేమ, అవగాహన ఉన్న సామాన్యులు కూడా పాలుపంచుకోవాలి. నిజమైన భారతదేశం గ్రామాల్లో ఉందంటారు. నా దృష్టిలో నిజమైన భాష పల్లెపట్టుల్లోనే ఉంటుంది. అక్కడ వాడుకలో ఉన్న పదాలను అందరం వాడుకుందాం. ఆ వాడుక తెలుగు భాషకు వేడుక అవుతుంది. డ్రెడ్జర్‌ అనే మాటకు ‘తవ్వోడ’ అన్న పదాన్ని సృష్టించింది సామాన్యులే. వారి అవసరార్థం దాన్ని కనిపెట్టారు. డ్రిప్‌ ఇరిగేషన్‌కు చుక్కల సాగు కూడా అలా వచ్చిందే. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ అందరి వాడుకలోకి రావాలి. అప్పుడే మన భాష మరింత శక్తిమంతమవుతుంది.

    మరో మహోద్యమం

    భాష, సంస్కృతి… రెండూ విడదీయరానివి… ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉన్నవి. అందుకే పిల్లలకు ఇవన్నీ నేర్పాలి. ఒక్క ఆంగ్ల శబ్దం కూడా రాకుండా తెలుగులో మాట్లాడేలా, రాసేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. వక్తృత్వం, వ్యాసరచన, సామెతలు, శతక పద్యాలు, కీర్తనలు వంటివాటిలో పోటీలు పెట్టాలి. విజేతలకు బహుమతులివ్వాలి. పాల్గొన్నవారందరినీ ఏదోరకంగా ప్రోత్సహించాలి. అవకాశం ఉన్నవారు తమ ఇళ్లలో కూడా పిల్లలచేత కసరత్తు చేయించాలి. ప్రోత్సహించాలి. పిల్లల్లో తెలుగు చదవాలన్న ఆసక్తిని, రచనాశక్తిని మనం పెంపొందించాలి. అందమైన తెలుగులో చిన్నారులను ఆకట్టుకునే కథలు, పుస్తకాలు విరివిగా రావాలి. వాటివల్ల భాషమీద, సంస్కృతిమీద మమకారం పెరుగుతుంది.

    మన భాషాసంస్కృతులు మనకు అమూల్య ఆస్తులు… మన వారసత్వ సంపద. వాటిని మనం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడతారు? ప్రపంచం మొత్తంమీద ఉన్న 12కోట్లమంది తెలుగువారి ఉనికికి సంబంధించిన విషయం ఇది. దీనికి ఎటువంటి ప్రమాదం రాకుండా అడ్డుకుందాం. 1822లో రాజా రామ్మోహన్‌రాయ్‌ సొంత సొమ్ముతో ఒక పాఠశాలను పెట్టారు. అందులో శాస్త్ర సాంకేతిక విషయాలను కూడా బెంగాలీలోనే బోధించే ఏర్పాట్లు చేశారు. ఆ మహానుభావుడే మనకు స్ఫూర్తి కావాలి. ఫ్రెంచ్‌ దేశస్తులు వాళ్ల కళలు, సంస్కృతిని కాపాడుకోవడానికి రెండు శతాబ్దాలపాటు సాంస్కృతిక పునరుజ్జీవన విప్లవం చేశారు. ఇది చరిత్ర. మన దగ్గర కూడా అలా చరిత్ర సృష్టించాలి. ‘తెలుగు భాషా పునరుజ్జీవన ఉద్యమం’ సాగాలి. ఈ మహాసభలు ఇందుకు నాందీ ప్రస్తావన చెయ్యాలి. భాషాప్రియులుగా మీరున్నారు. మీకు తోడుగా మేమూ ఉన్నాం.

    తెలుగు భాషా పునర్వికాసానికి కృషి చేసేందుకు ఈనాడులో ‘తెలుగు వెలుగు’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఆంగ్ల పదాలకు ప్రత్యామ్నాయాలు, సమానార్థకాల అన్వేషణ, పద సేకరణ, నూతన పదాల్ని సృష్టించడం, వాటిని వ్యాప్తిలోకి తేవడం… వంటివాటిపై ఈ విభాగం పనిచేస్తుంది. నా ఆకాంక్ష ఒక్కటే… తెలుగు భాష కొత్త పుంతలు తొక్కాలి. అగ్రగామిగా నిలవాలి. తెలుగు సంస్కృతి, వైభవం ఎప్పటికీ జీవనదిలా ప్రవహించాలి. ఇప్పటికే జాప్యం జరిగి ఉండవచ్చు. ఇక కాలయాపన తగదు. నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందడుగు వేస్తారని ఆశిస్తూ… సెలవు తీసుకుంటున్నాను.